హుస్నాబాద్ టౌన్/కోహెడ, జూలై 17 : మోటర్, లిఫ్ట్‌ల కింద వ్యవసాయం చేయడం అరిష్టమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది తాతలు, తండ్రుల నుంచి వస్తుందని పేర్కొంటూ ఒకింత అసంతృప్తి వ్యక్తంచేశారు. కొండలమీద కూడా వరి సాగుచేస్తున్నారని ఇది కూడా అరిష్టమని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామపరిధిలో రామారావు అనే రైతుభూమిలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ.. వరిలో ఆయిల్ పామ్ వేయాలని సూచించారు. కేంద్రం తీరుతోనే ఆయిల్ పామ్ పంట ధర తగ్గిందని ఆరోపించారు. ఇతర దేశాల నుంచి వచ్చే నూనె దిగుమతిపై సుంకం తొలగించడంతో మన దేశం లో రెండువేల వరకు పంట ధర తగ్గిందని తెలిపారు. కేంద్రం స్వార్థం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతున్నదని విమర్శించారు. బీహార్ ఎన్నికలు వస్తున్నాయని ఇలా ధరను తగ్గించి వేస్తున్నారని, త్వరలోనే దక్షిణాది మంత్రులతో కలిసి ప్రధానిని కలిసి ధర పెంపుపై చర్చించనున్నట్టు ఆయన చెప్పారు.