హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): మక్కజొన్న, జొన్న పంటల కొనుగోళ్లకు మద్దతు ధరల పథకం (ప్రైస్ సపోర్ట్ స్కీం)లో చేర్చాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇతర పంటలపై కేంద్రం విధించిన 25శాతం కొనుగోళ్ల పరిమితిని ఎత్తివేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు శనివారం లేఖ రాశారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎంధన్ ధాన్య కృషి యోజన నేషనల్ మిషన్ ఆన్ పల్సెస్ పథకాలను అభినందించిన ఆయన.. రాష్ట్రంలో అమలవుతున్న పీఎస్ఎస్ పథకంలో ఉన్న పరిమితులు, ప్రధాన పంటల కొనుగోలుపై కేంద్రం చూపెడుతున్న నిర్లక్ష్యం గురించి పేర్కొన్నారు.
ప్రస్తుతం పీఎస్ఎస్ పథకం కింద కొనుగోలు చేస్తున్న నువ్వులు, శనగలు, వేరుశెనగ, సోయాబీన్, పెసళ్ల వంటి పంటలపై కేంద్రం 25శాతం పరిమితి విధించడం వల్ల రైతులు పండించిన పంటలో కేవలం 25శాతం మాత్రమే మద్దతు ధరకు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందని తెలియజేశారు. తెలంగాణలోని వర్షాధార పంటల్లో మకజొన్న, జొన్న పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించినప్పటికీ, కేంద్రం కొనుగోలు చేయడం లేదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలకు కేంద్రమే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.