హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతుల అవసరాల మేరకు ఎరువులు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు లేఖ రాసినట్టు చెప్పారు. ఎరువుల సరఫరాపై శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష తర్వాత మంత్రి తుమ్మల మాట్లాడుతూ అక్టోబర్ నుంచి కేంద్రం నుంచి రావాల్సిన 8.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను కేవలం 6.73 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా అయిందని వెల్లడించారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫిబ్రవరిలో 45 వేల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా వచ్చిందని చెప్పారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సూచించారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ సంచాలకుడు గోపి, అధికారులు పాల్గొన్నారు.