శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయండి. యాసంగిలో రైతుభరోసా అందించే సమయానికి ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగంలోకి తేవాలి. తద్వారా సాగు విస్తీర్ణం ప్రకారం రైతుభరోసా నిధులు జమ చేయడం సులభం అవుతుంది.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నది. పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్న ‘రైతు భరోసా’లో కోతలకు మళ్లీ రంగం సిద్ధం చేస్తున్నది. ఈ యాసంగి సీజన్లో సాగు చేసిన(పంటలు వేసిన) భూమికే రైతుభరోసా పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. ఇందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంటే యాసంగి నుంచి పంట వేస్తేనే పెట్టుబడి సాయం అందుతుంది. లేదంటే నయా పైసా రాదు. దీనికోసం ఇప్పటికే శాటిలైట్ ద్వారా సాగు విస్తీర్ణాన్ని లెక్కించే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగదశలో ఉన్న ఈ సాంకేతికత త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నది. ఆ వెంటనే పంటల విస్తీర్ణాన్ని లెక్కించి, సాగు చేసిన భూములకు మాత్రమే రైతుభరోసా అందించనున్నారు. వ్యవసాయంపై నమ్మకం కోల్పోయిన అన్నదాతలకు ఆర్థిక భరోసా ఇచ్చి, భూమిని సాగులోకి తీసుకొచ్చి, దిగుబడులు పెంచే బృహత్తర లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో పెట్టుబడిసాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని భారంగా భావించి, కోతలు పెడుతూ అన్నదాతలను వేధిస్తున్నది. ఇప్పటికే ఒకసారి పూర్తిగా రైతుభరోసా ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే.
ఎకరానికి రూ.15వేలు సాయం చేస్తామని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు రూ.12వేలకు తగ్గించి రైతులను మోసం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వేసిన పంటకే పెట్టుబడి సాయం అంటున్నది. తద్వారా దాదాపు 90 లక్షలకుపైగా ఎకరాల్లో రైతులు నష్టపోతారని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. వానకాలంతో పోల్చి తే యాసంగిలో సాగు సగమే ఉంటుంది. వానకాలం లో 136 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, యాసంగి లో కేవలం 60-65 లక్షల ఎకరాల్లోనే సాగవుతాయని గణాంకాలు చెప్తున్నాయి. ఈ లెక్కన యాసంగిలో 70-75 లక్షల ఎకరాలకు రైతుభరోసాలో కోత పడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సగటున ప్రతి సీజన్లో 153 లక్షల ఎకరాలకు రైతుబంధు పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీల కారణంగా, తాజాగా ముగిసిన వానకాలంలో 145.73 లక్షల ఎకరాలకు మాత్రమే రైతుభరోసా విడుదల చేసింది. ఈ లెక్కన యాసంగిలోనూ రూ.8760 కోట్లు రైతులకు చేరాలి. కానీ సాగు చేసిన భూమికే రైతుభరోసా అంటే రూ.3600-3900 కోట్లు మాత్రమే పంపిణీ అవుతాయని చెప్తున్నారు. ఈ లెక్కన రైతులు ఏకంగా రూ.5 వేల కోట్ల వరకు నష్టపోతారని అంటున్నారు. కేసీఆర్ హయాంతో పోల్చితే రాబోయే యాసంగిలో 88-93 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం కోతపడనున్నదని స్పష్టంచేస్తున్నారు.
సాగు విస్తీర్ణం లెక్కలకు శాటిలైట్ సర్వే సాంకేతికత ను వినియోగించాలనే సర్కారు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచమంతా రైతులకు మేలు చేసేందుకు సాంకేతికతను వినియోగిస్తుం టే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులకు నష్టం చేసేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి సీజన్లో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగయ్యాయో లెక్క తేల్చేందుకు ఏఈవోల ద్వారా సర్వే చేయిస్తున్నది. ఈ విధానంలో సాగు లెక్కలు సరిగా రావడం లేదని, అవకతవకలు జరుగుతున్నాయని, రైతు భరోసా భారం పెరిగిపోతున్నదని వ్యవసాయ శాఖ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణాన్ని ఏఈవోల ద్వారా కాకుండా శాటిలైట్ ద్వారా చేయించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి శాటిలైట్ సాంకేతికత వినియోగంపై వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగం చేస్తున్నారు. యూనివర్సిటీ డిజిటల్ వింగ్ విభాగానికి ఈ బాధ్యతను అప్పగించారు. ఇది తుదిదశలో ఉన్న ట్టు సమాచారం. మరికొద్ది రోజుల్లో ప్రయోగం పూర్తవుతుందని, శాటిలైట్ సాంకేతికత ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని ఏంత మేరకు కచ్చితత్వంతో లెక్కించారనే అంశాన్ని తేల్చుతారని సమాచారం. ఆ తర్వాత ఈ సాంకేతికతను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించనున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు.. రైతులకు పెట్టుబడి సాయం అందడం గగనమైపోయింది. ప్రతి సీజన్లో ఏదో ఒక కొర్రీతో ఎగ్గొడుతూనే ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సీజన్లు ముగియగా ఈ యాసంగితో ఐదో సీజన్ వస్తున్నది. నాలుగు సీజన్లలో తొలి యాసంగి మినహా ఏ సీజన్లోనూ పూర్తిస్థాయిలో రైతుభరోసా ఇవ్వలేదు.