‘రైతులకు, కౌలురైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తాం’
– ఇదీ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీ.
‘రైతులకు, కౌలు రైతులకు ఎవరికి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం వాళ్లకు ఇస్తాం’
– ఇదీ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ.
‘రైతుభరోసా పెట్టుబడి సాయం ఎవరో ఒకరికే ఇస్తాం. దీనిపై రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలి’
-ఇదీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజా ప్రకటన.
Rythu Bharosa | హైదరాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): రైతులకు, కౌలురైతులకు ఇద్దరికీ రైతుభరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. ఇద్దరికీ ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుభరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి తుమ్మల స్పందిస్తూ.. ‘అది రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలి అని స్పష్టంచేశారు.
విధానపరమైన నిర్ణయాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రులకు సఖ్యత కుదరడం లేదనే అంశం ఇప్పటికే ప్రచారంలో ఉన్నది. రైతుభరోసాపై మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో ఇది మరోసారి నిరూపితమైంది. కౌలు రైతులకు రైతుభరోసాపై సీఎం రేవంత్‌రెడ్డి ఒక విధంగా చెబితే.. ఆ శాఖ మంత్రి తుమ్మల అందుకు భిన్నంగా చెప్పడం గమనార్హం.
కౌలు రైతులకు రైతుబంధు అంశంపై 2019లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమైంది. 2019లో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచే సందర్భంలో కౌలురైతులకు పెట్టుబడి సాయంపై కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘నేను బాధ్యత గల ముఖ్యమంత్రిగా చెప్తున్నా.. రైతులకు మేము సాయం చేస్తున్నాం కాబట్టి.. మీరు (రైతులు) మానవీయ కోణంలో ఆలోచించి కౌలురైతులకు సాయం చేయాలి. ఇది రైతులు, కౌలు రైతుల మధ్య జరగాల్సిన విషయం. ఆ ఇద్దరి మధ్య సమస్యతో ప్రభుత్వానికి సంబంధం లేదు’ అని నిక్కచ్చిగా చెప్పారు.
రైతుభరోసా పంట సాగు చేసిన రైతులకు మాత్రమే అందిస్తామని మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు. ‘99% కాదు… 200% చెప్తున్నా.. పంట వేసిన రైతులకు మాత్రమే రైతుభరోసా ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అదే అమలు చేయబోతున్నది’ అని స్పష్టంచేశారు. దీంతో రైతుభరోసాలో కోతలు తప్పవని తేలిపోయింది.