ఖమ్మం, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు మరో రెండు రోజుల్లో పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి మంగళవారం తుమ్మల మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో తీవ్రంగా పంట నష్టపోయిన జిల్లాల నుంచి నివేదికలు అందాల్సి ఉన్నదని తెలిపారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు వరద సాయం అందలేదని అన్నారు. తక్షణ సాయంగా కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు కోరినట్టు చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల గండిపడిన పాలేరు కాల్వ మరమ్మతు విషయంలో నీటిపారుదల శాఖ అధికారుల మధ్య సమన్వయలోపమే ఆలస్యానికి కారణంగా గుర్తించామని, అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.