హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): రూ. 2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులకు దశలవారీగా మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన రుణమాఫీపై అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రూ.2 లక్షలలోపు రుణం కలిగి, కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4,24,873 మంది ఉన్నారని తెలిపారు.
వీరిందరి వివరాలను సేకరించి కుటుంబ నిర్ధ్దారణ చేసేందుకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. వివిధ కారణాలతో రుణమాఫీ కాని రైతులు తమ వివరాలను ఇంటికి వచ్చే ఏఈవోకు గానీ, రైతు వేదికల్లో ఉండే ఏఈవోకు గాని అందజేయాలని సూచించారు.
రూ.2 లక్షలలోపు రుణం కలిగి ఆధార్లో తప్పులతో రుణమాఫీకాని రైతులు 1,24,545 మంది ఉండగా వీరిలో 41,322 మంది సమస్యను పరిష్కరించినట్టు తెలిపారు. మిగిలిన 83,223 మందికి ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పారు. రుణమాఫీ తర్వాత బ్యాంకులు వేగంగా రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తే.. తిరిగి బ్యాంకులు రైతులకు రూ.10,400 కోట్లు మాత్రమే చెల్లించాయని వివరించారు.