Tummala Nageswara Rao | ఖమ్మం, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీని వంద శాతం పూర్తి చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రుణమాఫీ నిమిత్తం మొత్తం రూ.20 వేల కోట్లను 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు పేర్కొన్నారు.
సోమవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. రూ.2 లక్షల రుణం కలిగిన రైతులందరికీ వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో భూములు ఉండి.. విదేశాల్లో ఉన్న వారి ఆధార్ కార్డులను సైతం సేకరించి బ్యాంకులకు లింక్ చేసి రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసినట్టు చెప్పారు. రూ.2 లక్షల రుణం తీసుకున్న రైతులు రాష్ట్రంలో ఒక్కరు కూడా లేరని తెలిపారు.