రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదు. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర జరుగుతున్నది. ఎరువులు, విత్తనాల కొరత అంటూ రైతులను గందరగోళానికి గురిచేస్తే చర్యలు తప్పవు.
-వ్యవసాయశాఖమంత్రి తుమ్మల
హైదరాబాద్, మే 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కొరత లేదని, అయితే కొన్ని రకాల పత్తి విత్తనాలకు మాత్రమే అధిక డిమాండ్ ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎక్కువ డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను అందరికీ అందించాలన్న ఉద్దేశంతోనే ఒక్కొక్కరికి రెండు ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పత్తి విత్తనాల కొరత ఉన్నదంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. ఎరువులు, విత్తనాల కొరత అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను గందరగోళానికి గురిచేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. రైతులను క్యూలో నిలబెట్టే సందర్భంలో లాఠీచార్జ్జి జరిగిందంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేయడం రైతుల నైతికైస్థెర్యాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ఇప్పటివరకు వివిధ కంపెనీలకు చెందిన 51,40,405 పత్తి విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచగా, 10,39,040 ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెప్తున్నట్టుగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అన్ని రకాల హైబ్రీడ్ విత్తనాలకు ఒకేరకంగా దిగుబడి వస్తుందని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
ఈ సీజన్లో 109.15 కోట్ల సబ్సిడీతో 1.95 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటివరకు 79,261 క్వింటాళ్లు పంపిణీ చేశామని, అందులో 54,162 క్వింటాళ్లు రైతులు కొనుగోలు చేశారని చెప్పారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 29,000 క్వింటాళ్లు ఇప్పటికే అధికంగా రైతులకు అందించామని పేరొన్నారు. ఎరువులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకున్నదని తెలిపారు. ప్రస్తుతం యూరియా 6.88 లక్షల టన్నులు, డీఏపీ 79 వేల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 4.21 లక్షల టన్నులతోపాటు ఇతర రకాలు కలిపి మొత్తం 12.28 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.