హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రెండు రోజులు కురిసిన వడగండ్ల వర్షానికి ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం 13 జిల్లాల్లో 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పంటనష్టంపై గ్రామాల వారీగా సర్వేచేసి, సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. వడగండ్ల వర్షాలతో ఇప్పటివరకు సుమారు 50 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగి ఉంటుందని వ్యవసాయశాఖ అంతర్గతంగా అంచనా వేసినట్టు తెలుస్తున్నది. ఇది మరింత పెరిగే అవకాశముందని సమాచారం.
వడగండ్ల వర్షాలకు వరి, మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. శనివారం కురిసిన భారీ వడగండ్లతో మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో భారీ పంటనష్టం జరిగింది. దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి వరి మొత్తం పాడైపోయింది. నరేందర్రెడ్డి అనే రైతుకు చెందిన 10 ఎకరాల వరి పంట చేతికి అందివచ్చిన సమయంలో మొత్తం దెబ్బతిన్నది. నాలుగైదు రోజుల్లో కోసేందుకు సిద్ధమనయ్యామని, ఇంతలోనే నష్టం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఒక్క గింజ కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోయారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విన్నవించారు.