హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూరియా నిల్వలు అడుగంటుతున్నాయి. వారం పది రోజులకు సరిపడా యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తర్వాత కేంద్రం నుంచి వస్తేనే రైతులకు యూరియా అందుతుంది. లేదంటే పరిస్థితి దారుణంగా ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సర్కారు వద్ద 1.09 లక్షల టన్నుల యూరియా ఉంది. రోజుకు సగటున 12 వేల టన్నుల చొప్పు న యూరియా విక్రయాలు జరుగుతున్నాయి.
ఈ లెక్కన వారం నుంచి పది రోజుల్లో యూరియా నిల్వలు మొత్తం ఖతమవుతాయి. ఈ మేరకు రాష్ట్రంలో యూరియా పరిస్థితిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు. రాష్ర్టానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశామని, ప్రస్తుతం 1.09 లక్షల టన్నుల యూరియా నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
ఈనెలలో 3లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని తెలిపారు. అయితే ఏప్రిల్ నుంచి జూలై వరకు 2.1 లక్షల టన్నులు తక్కువగా వచ్చిందని వివరించారు. ఈ లెక్కన మొత్తంగా 5.1 లక్షల టన్నుల యూరియా కొరత ఉందని స్పష్టం చేశారు. ఆగస్టులో రాష్ట్రంలో యూరియా వా డకం ఎక్కువగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నెలలో ధాన్యం, పత్తి, మక వంటి పంటలకు యూరియాను పైపాటుగా వాడుతారని, ఇలాంటి పరిస్థితుల్లో యూరియా కొరత లేకుండా చూడాలని విన్నవించారు.