హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ):‘భూమి ఉండి, రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తున్నాం…’ ఇదీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి తుమ్మల రుణమాఫీ వివరాలు వెల్లడిస్తూనే.. రుణమాఫీ ప్ర క్రియ ఇంకా పూర్తి కాలేదని, ప్రక్రియ కొనసాగుతూనే ఉంటదని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలతో గత ఐదేండ్లుగా పంట రుణం తీసుకున్న 42లక్షల మంది రైతుల వివరాలను బ్యాంక ర్లు ప్రభుత్వానికి అందించారని చెప్పారు. కానీ సీఎం రేవంత్రెడ్డి మాత్రం రాష్ట్రంలో భూమి ఉండి రుణాలు తీసుకున్న రైతుల సం ఖ్య 60 లక్షలుగా ఉన్నట్టు గతంలో స్వయం గా వెల్లడించారు.
ఒకవేళ మంత్రి తుమ్మల చెప్పినట్టుగా 42 లక్షల మంది రైతుల వివరాలు బ్యాంకులు అందిస్తే ఆగస్టు 15లోపు 31వేల కోట్లు రుణమాఫీ కావాలి. కానీ కఠిన నిబంధనలు పెట్టి సుమారు 20 లక్షల మంది రైతులను రుణమాఫీకి దూరం చేసిందనే వాస్తవాన్ని కప్పిపుచ్చారు. మిగిలిన రైతులకు ఎప్పటివరకు మాఫీ చేస్తారో చెప్పకపోవడం గమనార్హం. 2 లక్షలలోపు రుణమాఫీలో ఇంకా 4 లక్షల మందికి కుటుంబ నిర్ధారణ చేయాల్సి ఉండగా 3.5 లక్షల మందికి కుటుం బ నిర్ధారణ జరిగినట్టు తెలిపారు. ఇక రూ. 2 లక్షలకు పైగా రుణమాఫీపై ‘తాము షెడ్యూల్ ప్రకటిస్తామని, అప్పుడు 2లక్షలకు పైగా రుణం చెల్లిస్తే.. 2లక్షలు వారి ఖాతాలో జమ చేస్తాం’ అని పేర్కొన్న తుమ్మల షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారో మాత్రం చెప్పలేదు.
రుణమాఫీ పూర్తయ్యెదెన్నడో ?
100 రోజుల్లో రుణమాఫీ చేస్తామన్న రేవంత్రెడ్డి.. 300 రోజులు గడుస్తున్నా పూర్తి చేయలేదు. మంత్రి తుమ్మల చెప్పిన ప్రకారం.. ‘మా ప్రభుత్వానికి ఇది మొదటి ఏడాదే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలిసిందే.. మొదటి ఏడాది కొంతచేశాం.. మిగిలిన రుణమాఫీ ప్రక్రియను కొనసాగిస్తాం’ అన్నారు. ఐదేండ్లు ప్రహసనంలా కొనసాగిస్తారా ? అని రైతులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.