హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ): వ్యవసాయ శాఖలో ఉన్న కార్పొరేషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తున్నదా? ఆ కార్పొరేషన్లను మూసివేసేందుకే సిద్ధమవుతున్నదా? లేదా ఆరింటినీ కలిపి ఒకే కార్పొరేషన్‌గా చేయాలని చూస్తున్నదా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అయితే వీటిని మూసివేయడమా లేక అన్నింటినీ ఒకే గొడుకు కిందికి తేవడమా? అనే అంశంపై చర్చిస్తున్నట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టినట్టుగా సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్పొరేషన్లపై పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకుర్చుతున్నాయి. ఈ జాబితాలో ఆగ్రోస్, హాకా, హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికేషన్, గిడ్డంగుల కార్పొరేషన్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది.
వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్ల పనితీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొన్ని కార్పొరేషన్లతో ప్రభుత్వానికి నయా పైసా లాభం లేదనే అభిప్రాయం ఆయనలో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆయన తొలి నుంచి వ్యవసాయ శాఖ పరిధిలో ఇన్ని కార్పొరేషన్లు అవసరమా అంటూ ప్రతి సమావేశంలోనూ బహిరంగంగానే ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇటీవల 4 రోజు క్రితం జరిగిన సమావేశంలోనూ ఇదేఅంశాన్ని లేవనెత్తినట్టు తెలిసింది. ఒకే రకమైన పనిని వివిధ కార్పొరేషన్లు చేయడంపైనా ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఏ కార్పొరేషన్ కూడా సరిగ్గా పని చేయడం లేదనీ ఆయన విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఆగ్రోస్, హాకా, సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికేషన్, గిడ్డంగుల కార్పొరేషన్‌పై అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. పనితీరు మార్చుకోవాలని ఆయా సంస్థలకు మంత్రి పలుమార్లు హెచ్చరించారని, అయినా సదరు సంస్థలు మారకపోవడంతో మంత్రి ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఈ సంస్థలు అవినీతికి అడ్డాలుగా మారుతున్నాయనే అభిప్రాయమూ ప్రభుత్వంలో ఉన్నట్టు తెలిసింది. దీంతోనే ఆయా సంస్థలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయా సంస్థల లాభనష్టాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ వీటిని మూసివేస్తే వాటి పరిధిలో చేపట్టే పనులను ఏ కార్పొరేషన్లకు అప్పగించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఆ ఆరు కార్పొరేషన్లు ఒక్కోటి ఒక్కో చట్టం ప్రకారం ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే వీటిలో కొన్నింటికి చైర్మన్లను కూడా నియమించారు. ఈ నేపథ్యంలో వీటి మూసివేత అంత సులువు కాదనే అభిప్రాయాలు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఏం చేద్దామనే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. పనితీరు సరిగా లేని, ఉపయోగం లేని కార్పొరేషన్లు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అన్ని కార్పొరేషన్లను కలిపి ఒకే ఒక అధికారిని నియమించాలని, అది కూడా సీనియర్ ఐఏఎస్‌కు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్టు సమాచారం.