Minister Tummala | అశ్వారావుపేట రూరల్, జూలై 21: పెదవాగు వాస్తవ పరిస్థితిని అంచనా వేయకపోవడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతులు నాకు ఫోన్ చేసే దాకా మీరేం చేశారు? అధికారుల సమన్వయంతో పనిచేసి గేట్లను ముందుగానే తెరిచి ఉంటే ప్రమాదం జరిగేది కాదు కదా? వెలుతురు తగ్గి హెలికాప్టర్లు తిరిగే వాతావరణం లేకుంటే ప్రాణనష్టం జరిగేదే కదా?’ అంటూ మండిపడ్డారు. భదాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టుపై స్థానిక గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో భద్రాద్రి కలెక్టర్ జితేశ్ అధ్యక్షతన వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు.
అంతకుముందు ఆయన గండి పడిన ప్రదేశాన్ని, గుమ్మడవల్లి నుంచి ప్రాజెక్టుకు వెళ్లే రహదారిని, దానికి పడిన గండ్లను, పొలాల్లో వేసిన ఇసుక మేటలను, వరిపంట కొట్టుకుపోయిన పొలాలను, వరద వల్ల మునిగిన ఇండ్లను పరిశీలించారు. సమీక్షలో భాగంగా అధికారులతో మాట్లాడుతూ.. ఎగువ నుంచి వచ్చే నీటి గురించి ఆంధ్రా అధికారులతో మాట్లాడి 17వ తేదీనే ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంటే ఈ ప్రమాదం జరిగేదికాదని అన్నారు. అధికారుల సమన్వయలోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టంచేశారు.
రైతులు తనకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే కలెక్టర్, ఎస్పీని తాను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. ముందుగా ఎస్పీ నారాయణపురం చేరుకొని వరదలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడినట్టు ఆయన పేర్కొన్నారు. ‘లైటింగ్ తగ్గి హైలికాప్టర్లు తిరగకపోతే ఎంత ప్రాణనష్టం జరిగి ఉండేది?’ అంటూ ఐబీ అధికారులను మందలించారు. హైదరాబాద్ నుంచి హైలికాప్టర్లు నారాయణపురం చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సత్వరమే రెండు హెలికాప్టర్లను రప్పించినట్టు తెలిపారు. వాటి వల్ల 48 మంది ప్రాణాలను కాపాడగలిగామని అన్నారు. పెదవాగును పరిరక్షించేందుకు ప్రభుత్వపరంగా బాధ్యత తీసుకుంటామని, వచ్చే సీజన్ నాటికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని తుమ్మల భరోసా ఇచ్చారు.
కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విసృ్తతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార-పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిని మంత్రి సమీక్షించారు. గోదావరి పరీవాహ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా రెస్యూటీమ్‌లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించాలని అధికారులకు సూచించారు. ప్రమాదకరంగా ప్రవహించే వాగుల నుంచి ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.