హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): సీసీఐ టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జిన్నింగ్ మిల్లుల జాబితాను కలెక్టర్లకు పంపించి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం పత్తి సేకరణపై రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాయాధికారులతో ఫోన్లో సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కపస్ కిసాన్ యాప్‌లో రైతుల వివరాల నమోదులో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ఇందుకోసం ప్రతి కొనుగోలు కేంద్రంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ 18005995779ను ఏర్పాటుచేసి ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్టు అధికారులు తెలిపారు.