Runa Mafi | హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): ఆగస్టు 15 వరకు ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ బూటకమని తేలిపోయింది. గడువులోపు రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతులకు ఇచ్చిన మాట తప్పామని సొంత పార్టీ మంత్రులే ఒప్పుకొంటున్నారు. తమ తప్పును నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఒప్పుకొంటే నేడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తమ ప్రభుత్వ తప్పును బయటపెట్టారు. ఆగస్టు 15 వరకు సగం మంది రైతులకే రుణమాఫీ చేశామని కుండబద్దలు కొట్టారు. రుణమాఫీకి అర్హులైన మొత్తం రైతులు 41,78,892 మంది ఉండగా 22 లక్షల మందికే రుణమాఫీ చేసినట్టు స్పష్టంచేశారు. అంటే ఇంకా సుమారు 20 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టామని చెప్పకనే చెప్పారు. రుణమాఫీ కానివారందరికీ పూర్తిచేస్తామని చెబుతున్న మంత్రి, ఎప్పటిలోపు చేస్తారనేది చెప్పలేదు.
ప్రభుత్వం రూ.2 లక్షల వరకు అరకొర రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నది. ఇక 2 లక్షలకు పైన రుణాలున్న రైతులకు మాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభ్తుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. నిధులున్నప్పుడే వీరికి మాఫీ చేసేలా ప్రభుత్వ తీరు కనిపిస్తున్నది. ఈ రైతులకు సంబంధించి త్వరలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల వెల్లడించారు. నిధులు సమకూరడాన్ని బట్టి మాఫీ చేస్తామని స్పష్టంచేశారు. అంటే ఈ రైతులకు ప్రభుత్వం చెప్పినట్టుగా ఒకే దఫా మాఫీ కాదనేది స్పష్టమైంది. విడతల వారిగానే వీళ్లకూ రుణమాఫీ చేసే అవకాశమున్నది. అసలు క్యాబినెట్ భేటీ అయ్యేదెప్పుడో? చర్చించేదెప్పుడో? నిబంధనలు రూపొందించేదెప్పుడో? రుణమాఫీ చేసేదెప్పుడో? అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. 2 లక్షలలోపు రుణాలున్న వారి సమస్యలు, 2 లక్షల పైన రుణ రైతుల అంశంపై తుమ్మల స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
రూ.2 లక్షల పైన రుణాలకు సంబంధించి త్వరలోనే క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నది. దశలవారీగా మాఫీ చేస్తామనడంపైనా రైతాంగం భగ్గుమంటున్నది. ఇప్పటికే రుణమాఫీ నిబంధనలు రూపొందించి, ఉత్తర్వులు జారీ చేశారని, వాటి ప్రకారం రుణమాఫీ చేసినప్పుడు మళ్లీ క్యాబినెట్ నిర్ణయం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. క్యాబినెట్లో చర్చ, నిబంధనల పేరుతో కాలయాపన చేసేందుకు, ఈ సాకుతో మొత్తంగా రుణమాఫీని తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘డిసెంబర్ 9న రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం’.. ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు రుణమాఫీపై రేవంత్రెడ్డి చెప్పిన మాట! ‘ఆరు నూరైనా, తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా ఆగస్టు 15 వరకు రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం’ ఇది పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కనిపించిన దేవుళ్లందరిపైనా ఒట్టుపెట్టి మరీ రేవంత్ చెప్పిన మాట.. ఇలాఎన్నికల పబ్బం గడుపుకొనేందుకు రేవంత్రెడ్డి రుణమాఫీపై అప్పటిమందం హామీలిచ్చి తర్వాత నాలుక మడతేశారు. ఇచ్చిన హామీపైనా అబద్దాలు చెప్పటం కాంగ్రెస్ మంత్రులకే చెల్లింది. నాడు ఆగస్టు 15 వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పగా ఇప్పుడేమో ఆగస్టు 15 వరకు చిన్న, సన్నకారు రైతులకే రూ.2 లక్షల మాఫీ చేస్తామని చెప్పామని, చేశామని తుమ్మల వెల్లడించడం విస్తుగొలుపుతున్నది. హామీ మేరకు ఆగస్టు 15 వరకు రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ కాకపోవడంతో మంత్రి సైతం నాలుక మడతేశారన్న విమర్శలు వస్తున్నాయి.
ఖమ్మం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు పంట రుణాలను మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ప్రభుత్వం వద్ద 41,78,892 మంది రైతుల డాటా ఉన్నదని వెల్లడించారు. ఆయా రైతులు సుమారు 40 బ్యాంకులకు చెందిన 5,782 బ్రాంచీల్లో రూ.31 వేల కోట్ల పంట రుణాలు తీసుకున్నట్టు గుర్తించామని తెలిపారు. ఇందులో ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని వివరించారు.
వీరంతా రూ.2 లక్షలలోపు రుణాలు ఉన్నవారేనని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకుల తప్పిదాలు, సాంకేతిక కారణాల వల్లనే రుణమాఫీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అందరికీ రుణమాఫీ అయ్యే దాకా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ముందుగా రూ.2 లక్షలలోపు రుణాలు ఉన్నవారికి మాఫీ చేస్తామని తెలిపారు.
రూ.2 లక్షలకుపైన రుణం తీసుకున్న వారి విషయంలో ఏమి చేయాలనే అంశంపై క్యాబినెట్లో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రుణాలను కూడా దశలవారీగా మాఫీ చేస్తామని తెలిపారు. అయితే, రూ.2 లక్షలపైన రుణం ఉన్నవారు ఆపై మొత్తం కట్టాల్సి ఉంటుందని, ఆ తరువాతే వారికి మాఫీ పూర్తవుతుందని స్పష్టంచేశారు. తెల్లరేషన్ కార్డు లేకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టంచేశారు. అర్హులైన రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
రుణమాఫీలో ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ఆధార్ నంబర్లో తప్పులు, బ్యాంకు ఖాతాలో తప్పులు సహా ఇతరత్రా ఏమైనా కారణాల వల్ల రుణం మాఫీ కాకపోతే అలాంటి రైతుల కోసం మండల కేంద్రాల్లో వ్యవసాయ శాఖ అధికారి, గ్రామాల్లో వీవోఏలు, బ్యాంకుల వద్ద అధికారులను ప్రత్యేకంగా నియమించినట్టు తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులకు దరఖాస్తు అందజేయాలని సూచించారు. అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని, కుటుంబాలను నిర్దారించిన తరువాత ఆయా ఖాతాలకు రుణమాఫీ డబ్బులు చెల్లిస్తామని తెలిపారు.
2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తున్నామని తుమ్మల స్పష్టం చేశారు. ఎన్నికల హామీ ఇచ్చిన నాటి నుంచి రుణాలు మాఫీ చేద్దామనే చర్చ క్యాబినెట్లో జరిగినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం గత ఐదేండ్లలో రైతులు తీసుకున్న రుణం మొత్తం మాఫీ చేయాలని నిర్ణయించారని చెప్పారు.