ఖమ్మం, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణప్రతినిధి): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీతారామ ప్రాజెక్టుకు బీజం పడిందని, అప్పటి ప్రభుత్వం గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇవ్వడం వల్లే తాను బీఆర్ఎస్లో చేరానని, అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో భాగస్వామిని అయ్యానని, ఆ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామకు నిధులు కేటాయిం చి పనులు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం వెచ్చించిన రూ.8 వేల కోట్లతో అందుబాటులోకి వచ్చిన లింక్ కెనాల్ ద్వారా మాత్రమే రైతులకు సాగునీరు అందించనున్నట్టు స్పష్టంచేశారు.
15న సీఎం రేవంత్‌రెడ్డి నీటిని విడుదలను ప్రారంభిస్తారని తెలిపారు. లక్షలాది ఎకరాలకు సాగునీరందించే స్థాయిలో సీతారామ పూర్తికాలేదని, పూర్తికావాలంటే మరో రూ.10 వేల కోట్లతోపాటు ఐదేండ్ల సమయం కావాలని పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 40 ఏండ్లుగా రాజకీయాల్లో ఉంటూ అనేక ప్రభుత్వాల్లో మంత్రి గా పనిచేసిన తనకు.. చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, బీఆర్ఎస్ చేసిన పనిని తాము చెప్పుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రమూ నిజం లేదని తుమ్మల వ్యాఖ్యానించారు.