హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)/న్యూస్ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులన్నీ మూతపడాయి. ఎక్కడా ఒక్క క్వింటా పత్తిని కూడా కాంటా పెట్టలేదు. రోజూ వేలాది బస్తాలు, వందలాది మంది రైతులతో కిటకిటలాడే ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని పత్తియార్డు బోసిపోయింది. దీంతో కపాస్ కిసాన్ యాప్‌లో ముందుగా స్లాట్ బుక్ చేసుకొని ఆయా మార్కెట్లకు పత్తిని తీసుకొచ్చిన రైతులు పత్తిని కొనే దిక్కులేకపోవడంతో పలుచోట్ల తాము కూడా ఆందోళనలకు దిగారు. మరోవైపు, పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో తమ ఉపాధి దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తంచేస్తూ గుమస్తాలు, హమాలీలు కూడా ఆందోళనలు చేపట్టారు.
ఇలా పత్తి పండించే రైతులు, కొనుగోలు చేసే వ్యాపారులు, మార్కెట్లో పనిచేసే గుమస్తాలు, కార్మికులు.. అన్నీ వర్గాలు ఏకకాలంలో ఆందోళనలకు దిగడం గత పదేండ్లలో ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన ఎల్-1,ఎల్-2, ఎల్-3 నిబంధనను ఎత్తివేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, అన్ని మిల్లులకు పత్తి రావడంలేదని తెలిపారు. దీంతోపాటు కపాస్ కిసాన్ యాప్‌ను కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, సీసీఐ రైతులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. తేమ 12% మించితే కొనుగోలు చేయడంలేదు. కపాస్ కిసాన్ యాప్‌లో సాంకేతిక సమస్యలతో స్లాట్ బుకింగ్‌లో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలు పరిమితిని 7 క్వింటాళ్లకు తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సమస్కలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పలుసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో పత్తి కొనుగోళ్ల బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది.
తమ సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతోపాటు మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసినా ఫలితంలేదని, సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే తాము బంద్‌కు దిగాల్సి వచ్చిందని తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, వెంటనే సీసీఐ సీఎండీతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీసీఐ జాబ్‌వర్క్ టెండర్ ఫైనలైజేషన్ ద్వారా రూ.1,440 ధర నిర్ణయించి, 322 కాటన్ జిన్నింగ్ మిల్లులను రాష్ట్ర ప్రభుత్వం నోటిపై చేసినా వారికి సరిపడా పని కల్పించడంలేదని పేర్కొన్నారు.
ఎల్-1, ఎల్-2, ఎల్-3 విధానంలో వెసులుబాటు కల్పిస్తామన్న హామీని కూడా అమలుచేయడం లేదని విమర్శించారు. జాబ్‌వర్క్ అలాట్మెంట్ను కొన్ని మిల్లులకే చేసి మిగతా మిల్లులకు చేయకపోవడం వలన ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన లేబర్‌కు పని లేక వెనుతిరిగి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మిల్లుల నెలసరి మెయింటనెన్స్ చార్జీలు అదనంగా మిల్లర్లపై పడుతున్నాయని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నట్టు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రైవేట్, సీసీఐ పత్తి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు స్పష్టంచేశారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిల్లులన్నీ కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందారు. కిసాన్ కపాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు పెద్దఎత్తున మిల్లుల వద్దకు పత్తి లోడ్లతో తరలివచ్చి ఇబ్బందులు పడ్డారు. భారీ సంఖ్యలో వాహనాలు మిల్లుల బయటే గంటల తరబడి బారులుతీరడంతో సహనం నశించిన రైతులు ధర్నాకు దిగారు. నారాయణపేట జిల్లా మాగనూరు వద్ద రాయిచూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వీరికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మద్దతు తెలియజేశారు. రైతులతో కలిసి ఆయన రోడ్డుపై నాలుగున్నర గంటలపాటు బైఠాయించారు. జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ వద్దకు కూడా భారీ సంఖ్యలో రైతులు పత్తి లోడ్లతో తరలివచ్చారు. తమకు రాజకీయాలతో అవసరం లేదని, పత్తి కొనుగోలు చేయాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు తిప్పలు తప్పడం లేదని వాపోయారు. అయిజ-గద్వాల రోడ్డుపై ధర్నాకు దిగారు. బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య వీరికి మద్దతు తెలిపారు. ఉండవల్లి మండలంలోని శ్రీవరసిద్ధి వినాయక కాటన్ మిల్లు ఎదుట రైతు సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు ఈదన్న అధ్వర్యంలో రైతులు బైఠాయించారు. పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఓబులాయపల్లి సమీపంలోని మిల్లు వద్ద పత్తి లోడ్లతో ట్రాక్టర్లు, లారీలు బారులుతీరాయి. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో పత్తి రైతులు కూడా ధర్నా నిర్వహించారు.
జిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మె చేస్తున్న విషయంపై సీసీఐ అధికారులు రైతులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఖమ్మంరూరల్, ఏదులాపురంలో మూడు కొనుగోలు కేంద్రాలకు రోజూ మాదిరిగానే రైతులు దూరప్రాంతాల నుంచి పత్తిని తీసుకొచ్చారు. ట్రాక్టర్లు, ట్రాలీలను కిరాయికి తీసుకొని లూజు పత్తి తీసుకొచ్చారు. అయితే,ఎంతసేపటికీ కొనుగోళ్లు ప్రారంభంకాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు కిరాయికి వచ్చిన వాహనాల యజమానులు ఆలస్యమవుతున్నదంటూ ఒత్తిడి తేవడంతో వారికి సమాధానం చెప్పలేక అవస్థలు పడ్డారు. అప్పటికీ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఖమ్మంకోదాడ ప్రధాన రహదారిపై వెంకటగిరి క్రాస్‌రోడ్డు వద్ద పత్తిలోడ్‌తో ఉన్న వాహనాలను నిలిపి కొద్దిసేపు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తంచేశారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని పత్తి యార్డుకు రైతులు తీసుకొచ్చే పత్తి బస్తాలను కొనుగోలు చేయాలని గుమస్తాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుప్పాల రాజేందర్ డిమాండ్ చేశారు. సోమవారం మార్కెట్లో పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో పత్తియార్డు కార్యాలయం ముందు గుమస్తాలు, వివిధ కార్మికులు ధర్నా నిర్వహించారు. పత్తి కొనుగోలు నిలివేయడంతో పత్తి రైతులతోపాటు గుమస్తాలు, దడువాయిలు, వివిధ హామాలీ కార్మికులు ఉపాధి కొల్పోతున్నారని అవేదన వ్యక్తంచేశారు. రైతుల, కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వెంటనే పత్తి బస్తాలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పత్తి కొనుగోళ్లను బంద్ పెట్టిన నేపథ్యంలో మంగళవారం జిన్నింగ్ మిల్లులతో సీసీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపనున్నది. ఈ మేరకు సీసీఐ ఎండీతో కూడిన ఉన్నతాధికారుల బృందం హైదరాబాద్‌కు వస్తున్నట్టు తెలిసింది. బంద్‌ను విరమించి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని, మంగళవారం జరిగే చర్చల్లో సమస్యలు పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అదేవిధంగా జన్నింగ్ మిల్లుల సమస్యలు, బంద్‌పై సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర జౌళి శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.