హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల పట్ల బ్యాంకర్లు వివక్ష చూపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గురువారం జరిగిన బ్యాంకర్ల సమితి సమావేశంలో మంత్రి మాట్లాడారు. బడా వ్యాపారులు తీసుకున్న రుణాల రికవరీలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న బ్యాంకులు, రైతు రుణాల రికవరీలో మాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు.
రైతులు ట్రాక్టర్లు కొనుగోలు చేస్తే వారి భూముల ను తాకట్టు పెట్టుకొని రుణాలిస్తున్నారని, అదే బడా వ్యాపారులకు ఎలాంటి గ్యారెంటీతో రుణాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. బ్యాంకింగ్ వ్యవస్థ నిబద్ధతగా ఉండాలని, కలుషితం కావొద్దని సూచించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు బ్యాంకులు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు తమ సామాజిక బాధ్యతగా గుర్తించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. తమ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొన్నదని, రుణాల విషయంలో రైతుల పట్ల నిర్లక్ష్యం, అసహనం ప్రదర్శించొద్దని సూచించారు. రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు.