హైదరాబాద్, జూలై 7(నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోళ్ల అవినీతిలో భాగస్వాములైన వారికి కీలక పోస్టింగ్‌లు ఇవ్వడంపై ‘మార్కెటింగ్ శాఖలో ఇష్టారాజ్యం’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనం మార్కెటింగ్ శాఖలో సంచలనం సృష్టించింది. ఈ కథనంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. తాను వద్దని చెప్పినా ఎలా పోస్టింగ్‌లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో పోస్టింగ్‌ల వివరాలు బయటకు తీసి, నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తారా? మంత్రి వరకు వెళ్లనిస్తారా? అనే అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.