Tummala Nageswara Rao | నిజామాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు భరోసా పంపిణీలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షమాపణ చెప్పారు. ‘మమ్మల్ని మీరు (రైతులు) మన్నించాలి. మార్చి 31లోపు రైతుభరోసా వేస్తామని అనుకున్నాం. కానీ, ఆలస్యం అయ్యింది. తప్పకుండా అతి త్వరలోనే మిగిలినవారికి రైతుభరోసా జమ చేస్తాం’ అని వెల్లడించారు. సోమవారం ఆయన నిజామాబాద్‌లో నిర్వహించిన రైతు మహోత్సవం ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ.. ‘కుటుంబం అన్నాక కష్టాలు ఉంటాయి. కష్టకాలంలో, కరువు కాలంలో ఇంట్లో పెండ్లి చేస్తే, ఎంత బాధ ఉంటుందో అలాంటిదే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది.
అయినా సరే రూ.33 వేల కోట్లను ఒకే సంవత్సరం రైతుల జేబుల్లోకి పంపించాం’ అని పేర్కొన్నారు. పంటనష్ట పరిహారం కూడా త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని, ఆఫ్ అండ్ ఆన్ పద్ధతిలో నిజాంసాగర్ ఆయకట్టు రైతులు భారీగా దిగుబడి సాధించారని వివరించారు. మూడు, నాలుగు ఏండ్లలో ఆయిల్‌పాం కంపెనీలు వస్తాయని, నీళ్లున్నాయని వరి పంట సాగు కాకుండా, ఆయిల్‌పాం వైపు రైతులు దృష్టి కేంద్రీకరించాలని కోరారు. పసుపు బోర్డుతో రైతులకు లాభం జరిగేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. పసుపు బోర్డును పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రధాని, కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొన్నారు.
త్వరలోనే పూడికతీత: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నిజాంసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో పూడికను తొలగిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరులోపు టెండర్ పిలుస్తామని, లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరు పారే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ-20,21,22 పనులతోపాటు గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. మేడిగడ్డ కూలిన తర్వాత అన్నారం, సుందిళ్ల నిరుపయోగమైనా, రాష్ట్రంలో గత వానకాలం సీజన్లో 66.7 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153.5 లక్షల టన్నుల వరి ధాన్యం పండించిన ఘనత రైతులకే దక్కిందని పేర్కొన్నారు.
ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత అంటూ మంత్రి ఉత్తమ్ పదే పదే అక్కసు వెళ్లగక్కారు. యాసంగిలో 57 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల టన్నుల వరి ధాన్యం పండిందని చెప్పారు. తెలంగాణలో వానకాలం, యాసంగి పంటలు కలిపి 281 లక్షల టన్నుల వరి ధాన్యం పండించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నవిధంగా ధాన్యం కొనుగోళ్లు గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో లోపాలుంటే నేరుగా తనకు చెప్పాలని, చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీబ్యాగ్ కొరత ఉండటానికి వీల్లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. గన్నీ సంచుల కొరత ఉంటే 24 గంటల్లో చర్యలు చేపడతామని పేర్కొన్నారు.