Thummala Nageshwar Rao | హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు నారాజ్ అయ్యారా? సొంత సర్కారు పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారా? రైతులతో ముడిపడిన తన శాఖకు సంబంధించిన పథకాల అమలు తీరుపై ఆగ్రహంగా ఉన్నారా? నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిలదీశారా? అంటే ఈ ప్రశ్నలకు వ్యవసాయ శాఖ వర్గాలు ‘ఔను’ అనే సమాధానాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తరువాత రాష్ట్ర రైతాంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదనే అభిప్రాయాలున్నాయి. అరకొర రుణమాఫీ, ఆగిన రైతుభరోసా, ధాన్యం కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాల కొరత.. ఇలా ప్రతి అంశంలోనూ రైతులు మళ్లీ గోస పడుతున్నారు. ఈ పరిస్థితులకు ప్రభుత్వ పెద్దలే కారణమనే అభిప్రాయాన్ని మంత్రి తుమ్మల వ్యక్తంచేసినట్టు తెలిసింది. ‘ఆ ఇద్దరు’ కీలక మంత్రులు వ్యవసాయ శాఖకు అవసరమైన నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆలోచనలో మంత్రి ఉన్నట్టు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయ శాఖను నిధుల గండం వేధిస్తున్నది. దీంతో అనేక రైతు పథకాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. చీటికీ మాటికీ మంత్రుల హెలికాఫ్టర్ ప్రయాణాలు, రూ.27 కోట్లు ఖర్చు చేసి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ, చెల్లదని తెలిసినా రూ.160 కోట్లతో కులగణన.. ఇలా ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనవసర ఖర్చులు చేస్తున్నదనే విమర్శలున్నాయి. ఈవిధంగా రూ.కోట్లకు కోట్లు వృథా చేస్తున్న సర్కారు… రైతుల ప్రయోజనాల కోసం మాత్రం నిధులు విడుదల చేసేందుకు ససేమిరా అంటున్నట్టు తెలిసింది. రైతుభరోసా పథకాన్ని అర్ధాంతరంగా నిలిపేసింది.
ఈ పథకం కింద యాసంగి సీజన్‌కు రూ.9,300 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.5వేల కోట్లు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నది. మిగిలిన రూ.4,300 కోట్లు విడుదల చేయడం లేదు. రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించే రైతుబీమాకు కూడా సర్కారు ప్రీమియం చెల్లించకపోవడం గమనార్హం. దీంతో మరణించిన రైతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరిహారం అందడం లేదు. పంటల బీమాను అమలు చేస్తామని గొప్పగా చెప్పిన ప్రభుత్వం.. రూ.మూడు వేల కోట్లు చెల్లించలేక ఆ పథకాన్నీ అమలు చేయడంలేదు.
నిరుడు పచ్చిరొట్ట విత్తనాల బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరాదారులు విత్తనాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యం కొనుగోలు సమస్యలు అన్నీ ఇన్నీ కావు. రైతులు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని గొప్పగా ప్రకటించిన సర్కారు.. రైతులు సన్న ధాన్యం విక్రయించి నెల రోజులు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా వారికి చెల్లించలేదు.
ఇటీవల వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల తన అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలిసింది. రైతుభరోసా, రైతుబీమా, విత్తనాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. రైతు పథకాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని సీఎంను నిలదీసినట్టు సమాచారం. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకొని ఆర్థిక శాఖ ముఖ్య అధికారికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల.. ఇలాంటి దిద్దుబాటు చర్యలు వద్దని, వ్యవసాయ శాఖ, రైతు పథకాలకు సకాలంలో నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, పరిస్థితి ఇలాగా ఉంటే ఈ వ్యతిరేకత పెరగడం ఖాయమని హెచ్చరించినట్టు సమాచారం.