హైదరాబాద్ : హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ లీజు స్థలంలో కొనసాగుతున్న మహావీర్ హాస్పిటల్‌కు ఆ స్థలాన్ని శాశ్వతంగా అందజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు స్థలానికి సంబంధించిన పత్రాలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్(Ministers Talasani), మహమూద్ అలీ(Minister Mahamood Ali) హాస్పిటల్ చైర్మన్ మహేందర్ రాకాజీ, సునీల్ కపాడియాకు ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ మహావీర్ హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు(Poor People) అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. 1974 సంవత్సరంలో ప్రారంభించిన హాస్పిటల్ లో పేద ప్రజలకు అతి తక్కువ ఛార్జీల తో వైద్య పరీక్షలు, ఆపరేషన్ లు నిర్వహించడం అభినందనీయమన్నారు. జైన సంఘ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 62 డయాలసిస్ మిషన్ లు ఈ ఆసుపత్రిలో ఉన్నాయనిపేర్కొన్నారు. ప్రైవేట్ లో రూ. 2 వేల వరకు మాత్రమే ఛార్జీలు చేస్తారని తెలిపారు. మహావీర్ హాస్పిటల్ నిర్వహకుల విజ్ఞప్తి మేరకు హాస్పిటల్ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆ స్థలాన్ని వారికే కేటాయించారని వివరించారు.
జైన సంఘ్ కు ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం ఉప్పల్ భగాయత్ లో 2 ఎకరాల భూమి ని కూడా కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. హాస్పిటల్‌కు స్థలం కేటాయించడం పట్ల నిర్వాహకులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, హాస్పిటల్ చైర్మన్ మహేంద్ర రాకాజీ, వైస్ చైర్మన్ సుషీల్ కపాడియా, సునీల్ పహేడే, మోతీ లాల్, ఆశ, గింసి లాల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.