హైదరాబాద్ : రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులు లేకుండా పోతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. రైతులను కష్టపెట్టే ఏ ప్రభుత్వం కూడా బాగుపడిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొనడం తెలివితక్కువ ఆలోచన అని విమర్శించారు.
రైతును రాజు చేయాలని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విధాలుగా చేయూతను అందిస్తున్నది. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి, రైతుబీమా వంటి కార్యకమాలతో రైతులకు అండగా నిలుస్తుం దన్నారు. రైతుల పంటలను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకున్నదని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3 నుంచి 4 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు ఉద్యుత్ అందిస్తున్నదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? పార్టీ నిర్ణయమా చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించాలి. అతడితో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.