హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాని కిషన్ రెడ్డి మా మీద యుద్ధం చేస్తాడంటా? అని తలసాని నిప్పులు చెరిగారు. యుద్ధం చేస్తావా.. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో అని మంత్రి హెచ్చరించారు.
తెలంగాణ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు కిషన్ రెడ్డికి ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఈ మూడేండ్లలో సికింద్రాబాద్ ప్రజలకు లక్ష రూపాయాల పనైనా చేశావా? ధైర్యముంటే చెప్పగలవా? అని కిషన్ రెడ్డిని తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. హైదరాబాద్ సిటీలో వరద బాధితులకు సీఎం కేసీఆర్ రూ. 850 కోట్లు ఇచ్చి ఆదుకున్నారు. కిషన్ రెడ్డి మాత్రం కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకురాలేదు. వరదలప్పుడు కూడా పొలిటికల్ డ్రామా చేశాడు కిషన్ రెడ్డి. బండి వోతే బండి ఇస్తా.. సైకిల్ పోతే సైకిల్ ఇస్తా.. ఇల్లు పోతే ఇల్లు ఇస్తా అని బండి సంజయ్ చెప్పారు. ఏం ఇవ్వలేదు.
కాంగ్రెస్ ఐటీఐఆర్ ఇస్తామంటే మీరు వచ్చి రద్దు చేశారు. ఐటీఐఆర్ వస్తే హైదరాబాద్లో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ విషయాన్ని కేంద్రం వద్ద అడిగావా? అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. నీ యుద్ధం.. నీ శక్తి.. ఎంత మా ముందు? సికింద్రాబాద్ ప్రజలు తిట్టుకుంటున్నారు. ఓటేసిన ప్రజలకు బాధ్యతగా ఉండాల్సింది పోయి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయారు. గులాబీ జెండానే ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష. సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయి. తెలంగాణలో జరుగుతున్న పరిపాలన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగితే మేం చర్చకు సిద్ధం అని స్పష్టం చేశారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నాను అని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.