హైదరాబాద్ : పండుగలను గొప్పగా జరుపుకోవాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం మంజూరైన రూ.12లక్షల ఆర్థిక సాయం చెక్కులను మంత్రి వివిధ దేవాలయాల కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు.
మన సంస్కృతిని చాటిచెప్పే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న కారణంగా అనేక దేశాల్లో పండుగ నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణమన్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.15కోట్ల విడుదల చేయగా, మూడువేలకుపైగా దేవాలయాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, ఉప్పల తరుణి, ఆకుల రూప, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.