పాల్వంచ, ఫిబ్రవరి 7: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని, తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులను రప్పించాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రాష్ట్ర బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. బీజేపీ హయాంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని, ఆయా కంపెనీలను బడా పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం అవుతున్నాయని ధ్వజమెత్తారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ఆయా ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని హితవు పలికారు. రాష్ర్టానికి నిధులు తెప్పించలేని నాయకులకు సీఎం కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదని చురకలంటించారు. ఇప్పటివరకు రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించారని, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల అనవసరపు రాద్ధాంతాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను విమర్శించే నైతిక హక్కు ఆ పార్టీ నేతలకు లేదన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.