దవాఖానలకు భూమిపూజ కనిపిస్తలేదా?
కేంద్రానికి మంత్రి తలసాని శ్రీనివాస్ సవాల్
బండి సరిపోతే అమిత్ షా ఎందుకొచ్చినట్టు?
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిలదీత
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, టీఆర్ఎస్ కూడాఎన్నికల్లో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సవాల్ విసిరారు. కేంద్రంలో ఉన్నాం కదా.. ఏదైనా చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభించింన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి అవకాశం ఇవ్వండని ప్రజలను అడిగే అవకాశం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉంటుందని, కేంద్రం రాజీనామా చేస్తే అందరం ప్రజల్లోనే తేల్చుకొందామని అన్నారు. తాము హైదరాబాద్‌లో నాలుగు ప్రభుత్వ దవాఖానల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తే, దానిని కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడారని వారికి, అక్కడే ఉన్న బీజేపీ నాయకులు ఢిల్లీ టూరిస్టులకు వాస్తవాలను ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దవాఖానలకు భూమిపూజ చేసిన విషయం కనిపించడం లేదా? అని నిలదీశారు.
బండి సంజయ్ సరిపోతే అమిత్‌షా ఎందుకొచ్చినట్టు? : వేముల ప్రశాంత్‌రెడ్డి
కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో బీజేపీ నేతలు చెప్పాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ చేశారు. రాష్ర్టానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని, నవోదయ పాఠశాలల్లో మొండిచెయ్యి చూపారని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఇవేవీ ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? ఖబడ్దార్.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. తెలంగాణలో అభివృద్ధి లేదంటున్న అమిత్‌షా.. డబుల్ బెడ్రూం ఇండ్లను గుజరాత్లో ఎందుకు కట్టడం లేదని నిలదీశారు. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ చాలని చెప్తున్న అమిత్‌షా.. మరి తెలంగాణకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడం చేతగాక, తెలంగాణను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.