సిద్దిపేట, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/ తొగుట: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ నుంచి నీటిని విడుదల చేసింది. శనివారం సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ పంపుహౌస్ వద్ద రంగనాయకసాగర్‌లో పూజలు చేసిన అనంతరం దేవాదాయశాఖమంత్రి కొండా సురేఖ నీటిని విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రంగనాయకసాగర్ సామర్థ్యం 3 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 2.44 టీఎంసీలు అని తెలిపారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్లలోని పూర్తి ఆయకట్టు 1.10లక్షల ఎకరాలు అని చెప్పారు. ఈ నీటి విడుదలతో 166 చెక్‌డ్యామ్‌లు నింపేందుకు వీలు కలుగుతుందని వివరించారు.
బీఆర్ఎస్ పోరాటం.. పొలాలు సశ్యశ్యామలం
రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ నీటి విడుదలతో యాసంగికి సాగునీరు అందనున్నది. రైతాంగానికి సాగునీరు విడుదల చేయాలని భారీ నీటి పారుదలశాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిసెంబర్ 4న లేఖ రాశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నీటి విడుదలకు చొరవ చూపారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కాల్వల వెంట పర్యటిస్తూ రైతులకు నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరాటం ఫలించి, కాళేశ్వరజాలలు విడుదలయ్యాయని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ఆందోళనకు దిగితే తప్ప నీటిని విడుదల చేయడంలేదని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ నేతలు ఇప్పుడేమంటారు!
సామాజిక మాధ్యమాల్లో, రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందడం లేదని గతంలో కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. అధికా రంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పాటపాడారు. కానీ ఇప్పుడు మంత్రి కొండా సురేఖ నీటి విడుదల చేశారని, కాంగ్రెస్ నేతలు ఇప్పుడేమంటారని బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ కృషి తోనే ప్రాజెక్టుల నిర్మాణం
మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్దంటూ అడ్డుకున్న నేతలే నేడు గోదారమ్మకు హారతులు పడుతున్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చెప్పారు. తొలి సీఎంగా ఆచరణలో చేసి చూపించారు. కేసీఆర్ కృషితో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందాయి. కాళేశ్వరం కూలి పోయిందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. నేడు విడుదల చేసిన గోదావరి జలాలు కాళేశ్వరం నుంచి వచ్చినవి కావా? ప్రభుత్వం కూడవెల్లివాగు, రామాయంపేట, చిన్నశంకరంపేట కాలువలకు నీళ్లు విడుదల చేయాలి.
-కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే