వరంగల్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓరుగల్లులో జూన్ 22న (ఆదివారం) భద్రకాళి అమ్మవారికి తొలి బంగారు బో నం సమర్పిస్తామంటూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమైంది. సొంత పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితోపా టు పలువురు వేద పండితులు, స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం భద్రకాళికి బోనం ఉండదని, తరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను మార్చొద్దని, దీనిపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. బోనాలకు తాను వ్యతిరేకం కాదని, గ్రామదేవత వద్ద సమర్పిస్తే తా మంతా అక్కడి వస్తామని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు మంత్రి శుక్రవారం ప్రకటించారు.
మరోవైపు, భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించే అంశం ఆగమశాస్ర్తానికి విరుద్ధమని పండితులు చెప్తున్నారు. అమ్మవారికి కల్యాణాలు, బ్రహోత్సవాలు జరిగే ఆలయాల్లో బోనాలు సమర్పించే సంప్రదాయం లేదని పండితులు స్పష్టంచేస్తున్నారు. బోనం సమర్పించిన తర్వాత జంతుబలి ఆనావాయితీగా వస్తున్నదని, భద్రకాళిలో బోనాలు మొ దలుపెడితే జంతుబలిని ఆపడం సాధ్యమేనా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. మీడియా తో తన నివాసంలో చిట్‌చాట్ చేసిన మంత్రి సురేఖ.. భద్రకాళి ఆలయం కొందరి సొత్తు అన్నట్టుగా భావిస్తున్నారని, అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ ఎమ్మెల్యే నాయినిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత హీటెక్కింది. ఇటీవల భద్రకాళి అమ్మవారి బోనాలకు సంబంధించి కొంతమంది నుంచి అభ్యంతరాలు వ్యక్తంకావడం, స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలతో అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో తాత్కాలికంగా రద్దు చే స్తున్నట్టు తెలిపారు. బోనాలపై సంప్రదింపులు జరిపిన అనంతరం భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.