ఖైరతాబాద్, మార్చి 19: హుస్నాబాద్‌లో ఓ మంత్రి భూమి ఆక్రమణను ప్రోత్సహిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావే శం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. హుస్నాబాద్‌లో తన 4 ఎకరాల 4 గుంటల భూమిని ఎల్లమ్మగుడికి విరాళంగా ఇచ్చానని తెలిపారు. ఆ పక్కనే 32 గుంటల భూమి ఉందని, దాన్ని కబ్జా చేసేందుకు ఓ ఆలయ ఈవో, మరికొందరు యత్నాలు మొదలు పె ట్టారని ఆరోపించారు.
ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఆమె భరోసా ఇవ్వడంతో కబ్జాదారులు భూమి చదును పనులు ఆపివేశారని తెలిపారు. కానీ స్థానికంగా మరో మంత్రి అండదండలతో తిరిగి పనులు కొనసాగిస్తున్నారని రఫీ తెలిపారు. హైకోర్టు ఆదేశాలను కూడా మున్సిపల్ జాయింట్ కమిషనర్ పట్టించుకోవడంలేదని విమర్శించారు. తన భూమిలో గుడి లాంటి నిర్మాణాన్ని చేపట్టారని, మతపరమైన ఇబ్బందులను సృష్టించాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రఫీ మీడియా సమావేశంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్విరాజ్ పాల్గొన్నారు.