హైదరాబాద్ : ఈ నెలాఖరు నుంచి ఆషాఢ బోనాల వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 6న వేడుకలపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్ష సమావేశం జరుగనున్నది. సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, జీహెచ్ఎంసీ పరిధిలోని రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. అలాగే హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, దేవాదాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు వేడుకల నిర్వహణ, ఏర్పాట్లతో పాటు భద్రత సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.