శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 02:12:56

రామప్పకు యునెస్కో గుర్తింపు

రామప్పకు యునెస్కో గుర్తింపు
  • ఆలయం ఎదుట చెరువులో జ్ఞానకేంద్రం ఏర్పాటు
  • శాసనమండలిలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి
  • ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నకు సమాధానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వరంగల్‌లోని రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించేవిధంగా సీఎం కే చంద్రశేఖర్‌రావు కృషిచేస్తున్నారని పర్యాటక, ఆబ్కారిశాఖమంత్రి శ్రీనివాసగౌడ్‌ చెప్పారు. ప్రపంచ వారసత్వకట్టడంగా గుర్తింపుపొందడానికి కావాల్సిన అన్నిచర్యలను ప్రభుత్వం తీసుకుందని, ఈ మేరకు ప్రతిపాదనలు కూడా పంపిందని తెలిపారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో రామప్ప దేవాలయంపై పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఆలయం ఎదుటనున్న చెరువులోని చిన్నదీవిలో జ్ఞానకేంద్రాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. వరంగల్‌లోని ఇంకా అనేకప్రాంతాలను పర్యాటకకేంద్రాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ చెరువులను పునరుద్ధరిస్తూ, పలుచోట్ల రిజర్వాయర్లు నిర్మిస్తున్నారని, ఈ క్రమంలో కాళేశ్వరం నుంచి అన్ని ప్రాంతాలు కలిపేవిధంగా పర్యాటక ప్రాజెక్టును ఏర్పాటుచేస్తామని మంత్రి తెలిపారు. మెదక్‌ చర్చిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 


రెండేండ్లలో 1.5 లక్షల డబుల్‌ ఇండ్లు 

  • గృహనిర్మాణశాఖ మంత్రి వేముల

రాష్ట్రంలో వచ్చే రెండేండ్లలో ఒకటిన్నర లక్షల డబుల్‌బెడ్‌రూం ఇండ్ల ను నిర్మిస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమి స్తూ, ఇప్పటికి 39,321 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని వాటికి రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ పథకానికి కేం ద్రం నుంచి నిధులు చాలా తక్కువగా వస్తున్నాయన్నారు. ప్రస్తుతం 1.40 లక్షల ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, ఖాళీస్థలాలు ఉన్న వారికి మరో లక్ష ఇండ్ల నిర్మాణాలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. బడ్జెట్‌లో ఇండ్ల నిర్మాణాల కోసం రూ.10,500 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు.


ఏటా రూ.365 కోట్ల ఆదాయం

  • కార్గో, పార్సిల్‌ సర్వీసులతో.. : మంత్రి పువ్వాడ

నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సొంతంగా నిధుల సేకరణ కోసం కార్గో, పార్సిల్‌ సేవలు ప్రారంభించబోతున్నామని, వీటిద్వారా ఏటా రూ.365 కోట్లు సమీకరించుకుంటామని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. గత రెండునెలల్లో ఆర్టీసీకి దాదాపు రూ.13 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు సొంత నిధులతో జీతాలు ఇచ్చే స్థాయికి ఎదిగిందన్నారు. 


ఎంబీసీలకు 500 కోట్లు : గంగుల

ఎంబీసీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు ప్రతిపాదించామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఎంబీసీలో మొత్తం 18 కులాలు ఉన్నాయన్నారు. అవసరమైతే ఎంబీసీ కార్పొరేషన్‌కు నిధులు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈ క్రమంలో కులవృత్తులపై ఆధారపడినవారికి అన్నిరకాల వసతి సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.   


logo