హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : ‘నీరా’.. ‘వేదామృతం’.. ఈ రెండింటి పేర్ల మధ్య చెలరేగిన వివాదానికి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టినట్టు తెలుస్తున్నది. మొదటినుంచీ ఏ పేరుతో అయితే నీరాను ప్రపంచానికి పరిచయం చేశారో.. అదే పేరుతోనే నీరా, దాని అనుబంధ ఉత్పత్తులు అతి త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నది. దీంతో ఆబ్కారీ శాఖ అధికారులు ‘నీరా’ పేరుతోనే నీరా.. దాని అనుబంధ ఉత్పత్తులు సిద్ధం చేస్తున్నారు. ఇదే విషయాన్ని త్వరలోనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇటీవల గౌడ కులస్థులతో జరిగిన సమావేశంలో నీరా కేంద్రాలను నెలలోపు ప్రారంభించనున్నట్టు శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు.
ఇప్పటికే నెక్లెస్‌రోడ్‌లోని నీరా కేఫ్ అత్యంత సుందరంగా కార్పొరేట్ హంగులతో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. మొన్నటివరకూ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండటంతో ప్రారంభం ఆలస్యమైంది. హైదరాబాద్‌లోని నీరాకేఫ్లోనే వాటి అనుబంధ ఉత్పత్తులైన తాటి/ఈత బెల్లం, తాటి/ఈత సిరప్ (తేనె), పామ్ బూస్ట్, పామ్ గ్రాన్యూల్స్, తాటి ఫలాలు, ముంజలు, గేగులు, ఈత పండ్లువంటివి విక్రయించనున్నారు. రూ.12.20 కోట్లతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నీరాకేఫ్‌ను రాష్ట్ర సర్కారు నిర్మించింది. ఇదే స్ఫూర్తితో భువనగిరిలోని నందనం, రంగారెడ్డిలోని ముద్విన్, సంగారెడ్డిలోని మునిపల్లి, నల్లగొండలోని సర్వేల్లో నాలుగు నీరా సేకరణ కేంద్రాల కోసం ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. అనుభవజ్ఞులైన గీత కార్మికులను గుర్తించి నీరా సేకరణపై వారికి శిక్షణ కూడా ఇప్పించింది.