Minister Srinivas Goud | దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న అమరవీరుల సంస్కరణ ర్యాలీ నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం నుంచి అమరజ్యోతి వేదిక వరకు 6వేల మంది కళాకారులతో వివిధ కళారూపాలతో ఘనంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల చైర్మన్లు రసమయి బాలకిషన్, జూలూరీ గౌరీశంకర్, దీపికారెడ్డి, మంత్రి శ్రీదేవి, సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, టూరిజం ఎండీ మనోహర్, పురావస్తు శాఖ అధికారులు నారాయణ, నాగరాజు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్లో నిర్వహిస్తున్న ర్యాలీలో తెలంగాణ కళావైభవాన్ని, తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దశ దిశల చాటాలని మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
6వేల మంది జానపద, గిరిజన, దక్కనీ కళాకారులు, శాస్త్రీయ కళాకారులు ర్యాలీలో పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం నుంచి అమర జ్యోతి వేదిక వరకు ‘అమరవీరుల సంస్మరణ ర్యాలీ’ నీ నిర్వహించి అమరులకు ఘనమైన నివాళి అర్పించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మరుగున పడిన తెలంగాణ ప్రాచీన కళలకు పూర్వ వైభవాన్ని తెచ్చామన్నారు. ర్యాలీలో తెలంగాణకు చెందిన డప్పుల కళాకారులు, ఒగ్గుడోలు, బోనాలు, కోలాటం, గుస్సాడి, కొమ్ముకొయ, లంబాడీ, రాజన్న డోలు, కోలాటం, చిందు యక్షగానం, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, బతుకమ్మలు, షేరి బాజా, మర్ఫాలతో పాటు పేరిణి, కూచిపూడి, భరత నాట్యం, కథక్ వంటి శాస్త్రీయ నృత్య కళాకారులు శకటాలపై తమ కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. అమరవీరులకు ఘనమైన నివాళి అర్పించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.