హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న కుట్రలను ఛేదిస్తామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదు.. ఆయనను బద్నాం చేయాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కోవడానికి మా వ్యూహం మాకుంది అని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర సమస్యలపై పోరాడేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధంగా లేవు అని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల సమస్యలను విన్నవించేందుకు ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానపరచడం సరికాదన్నారు. జాతీయ పార్టీల నాయకులు ఢిల్లీకి పైరవీల కోసం వెళ్తే.. టీఆర్ఎస్ నాయకులు మాత్రం తెలంగాణ ప్రయోజనాల కోసం వెళ్తున్నారని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ పూర్తిగా కేంద్రం భాద్యతే.. కానీ దాన్నుంచి తప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారు. మంచి చేస్తే దేశమంతా తిరిగి కేంద్రం మంచి చేసిందని చెబుతాం. చెడు చేస్తే దానికి తగ్గట్టే వ్యవహరిస్తాం అని మంత్రి హెచ్చరించారు.
రైతుల కోసం అన్ని పార్టీలు ఒక్కటైన సందర్భాలు అనేకం. కానీ తెలంగాణ లో ప్రతిపక్షాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి అని పేర్కొన్నారు. యాసంగిలో వరి వేయాలా వద్దా స్పష్టంగా కేంద్రం చెప్పాలి అని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ కన్నా గొప్పగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ధాన్యం సేకరణ విషయంలో పంజాబ్కో విధానం.. తెలంగాణకు మరో విధానమా.. అని ప్రశ్నించారు. రైతులను తొక్కాలని చూస్తే తెలంగాణ ఆగ్రహానికి గురి కాక తప్పదు.. ఇప్పటికైనా తెలంగాణకు క్షమాపణ చెప్పి రైతులకు కేంద్రం న్యాయం చేయాలి అని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.