Srinivas Goud | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా, కించపరిచే విధంగా ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. బీసీ నాయకుల జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. బీసీల జోలికొస్తే బీసీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. బీసీలను అణిచివేయాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందన్నారు. తమ ఓట్లతో గెలిచి.. తమనే టార్గెట్ చేస్తున్నారు. బీసీ నాయకులను టార్గెట్ చేసే వారి విషయంలో త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. బీసీ కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగడుతామన్నారు. గడపగడపకు వెళ్లి బీసీలపై కాంగ్రెస్ చేస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడుతామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.