ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), అక్టోబర్ 31 : చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ఆర్ట్స్ కళాశాలలో (Arts College) చేపట్టిన ధర్మదీక్షలో సాక్షాత్తు బీసీ మంత్రికే అవమానం ఎదురైంది. ఈ సందర్భంగా పోలీసులు చేసిన అతి తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్రి అనే కనీస గౌరవం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై మంత్రి వాకిటి శ్రీహరి ఆవేదనకు గురయ్యారు. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ధర్మదీక్ష నిర్వహించారు. దీక్షకు కూర్చున్న వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పూల దండలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సహా పలువురు ప్రముఖులు, మేధావులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. అయితే, ఈ సందర్భంగా పోలీసుల చేసిన ఓవరాక్షన్ చర్చకు దారితీసింది. దీక్షకు అనుమతినిస్తున్నట్టు గురువారం మౌఖికంగా చెప్పిన పోలీసులు శుక్రవారం ఉదయం టెంట్ వేసేందుకు కూడా నిరాకరించారు. దీంతో దీక్ష మొత్తం మండుటెండలోనే కొనసాగింది. మంత్రి కూడా ఎర్రని ఎండలో కింద కూర్చుని దీక్షకు సంఘీభావం తెలిపారు. పోలీసులు తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడంపై ఆయన ఒకింత ఆవేదనకు గురయ్యారు. బీసీ నేతలకు జరిగిన అవమానంపై జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీక్షా శిబిరానికి మంత్రి, ఎంపీ, విప్‌తో పాటు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ప్రొఫెసర్ కోదండరాం, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు, డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్, బీసీ జేఏసీ కన్వీనర్ గటిక విజయ్‌కుమార్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్లో ఆమోదించి, రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరారు.
రాజకీయ నాయకులను నమ్మలేమని, విద్యార్థులే ఉద్యమాన్ని నడిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన బీసీలకు రూ. 20 వేల కోట్ల నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నామినేటెడ్ పోస్టుల కేటాయింపులోనూ బీసీలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తన ఆంతరంగిక, అర్ధరాత్రి స్నేహితుడు ప్రధాని మోదీని బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒప్పంచాలని అన్నారు. లేనిపక్షంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఆమరణ దీక్ష చేపట్టి, అమరుడై రిజర్వేషన్లు సాధించాలని హితవు పలికారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నిజ్జన రమేశ్‌ముదిరాజ్, దేశగాని సాంబశివగౌడ్, వట్టికూటి రామారావుగౌడ్, జగన్ ముదిరాజ్, మాలిగ లింగస్వామి, శివరాత్రి ప్రశాంత్, రెడ్డి శ్రీనివాస్, బొల్లేపల్లి స్వామిగౌడ్, మాసంపల్లి అరుణ్‌కుమార్, నక్క శ్రీశైలంయాదవ్, బైరు నాగరాజుగౌడ్, అవ్వారి వేణు, బొమ్మ హన్మంతరావు, కేతూరి వెంకటేశ్, రాస వెంకట్‌ముదిరాజ్, ఆర్ఎల్ మూర్తి, జూలు నాగేశ్వర్, కృష్ణకిశోర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ ప్రజాప్రతినిధులకు పదే పదే అవమానం చోటు చేసుకుంటున్నది. గతంలో పలువురు ప్రజాప్రతినిధులకు తీవ్ర అవమానం జరిగింది. తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఆదేశాలను సైతం పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో సదరు మంత్రి వాకిటి శ్రీహరికి తీవ్ర పరాభవం ఎదురైంది. సాక్షాత్తూ ఆయన ఫోన్ చేసి చెప్పడంతో పాటు ఆయన హాజరైన కార్యక్రమానికి పోలీసుల అనుమతించపోవడం బీసీల ఆగ్రహానికి కారణమవుతున్నది. మంత్రి, విప్ ఇద్దరు వచ్చినా కనీసం మూడు నక్షత్రాలు ఉన్న పోలీసులు అధికారులెవరూ కనిపించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన మంత్రి, విప్ దాదాపు గంటన్నర పాటు మండుటెండలో కటిక నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు టెంటు వేసేందుకు అనుమతి ఇవ్వని కారణంగానే విద్యార్థులతో సహా తాను సైతం ఎండలో కూర్చున్నానని చెప్పిన మంత్రి వాకిటి శ్రీహరి దీనికి కారకులైన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
జేఏసీ నాయకులు కథనం ప్రకారం ధర్మదీక్షకు అనుమతి కోసం పోలీసు అధికారులను సంప్రదించగా ముందుగా నిరాకరించారు. గురువారం సాయంత్రం మరోసారి సంప్రదించగా, ఒకరికి అనుమతిస్తే, ఎవరు వచ్చినా ఇవ్వాల్సి వస్తుందని అభ్యంతరం వ్యక్తంచేశారు. న్యాయమైన డిమాండ్ కోసం తాము చేస్తున్న ధర్మదీక్ష ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం ప్రజలందరి మద్దతు కూడగట్టేందుకు చేస్తున్న ఒక ప్రయత్నంగా వివరించారు. అప్పటికీ అంగీకరించని అధికారులు చివరికి ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు దీక్ష చేసుకోమని మౌఖికంగా అనుమతిచ్చారు. రాత్రి సమయంలో మంత్రి వాకిటి శ్రీహరి సైతం పోలీసు అధికారులకు ఫోన్ చేసి అనుమతిపై వాకబు చేశారు. అప్పటికి సానుకూలంగా స్పందించిన పోలీసు అధికారులు శుక్రవారం ఉదయానికి ప్లేటు ఫిరాయించారు. దీక్షకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ టెంట్‌తో వచ్చిన ఆటోను పోలీస్‌స్టేషన్ తరలించారు.