హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జీవరేఖ కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తేటతెల్లమైంది. అసెంబ్లీ వేదికగా మంత్రులు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే దీనిని నిర్ధారిస్తున్నాయి. ప్రాజెక్టుకు ఇప్పట్లో మరమ్మతు చేసే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని స్పష్టంగా తెలిసిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తారా? లేదా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో సూటిగా నిలదీశారు. 20 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేయడం లేదని ప్రశ్నించారు.
కాళేశ్వరానికి అయిన ఖర్చు రూ. 94 వేల కోట్లయితే, అందులో మేడిగడ్డకైన ఖర్చు రూ. 4 వేల కోట్లని, బరాజ్‌లో పగుళ్లు వచ్చిన బ్లాక్‌ను మరమ్మతు చేసేందుకు రూ. 300 కోట్లు అవుతాయని, అదికూడా నిర్మాణ ఏజెన్సీ ఎల్అండ్టీ సంస్థ పెట్టుకుంటామని చెప్తున్నదని వివరించారు. కానీ ప్రభుత్వం కావాలనే ఆ సంస్థకు అనుమతివ్వడం లేదని ఆరోపించారు. నీళ్లు వచ్చి పిల్లర్లు కొట్టుకుపోతాయని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారని, కానీ ఇప్పటికీ లక్షల క్యూసెకుల నీళ్లు బరాజ్ గుండా పోతున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించి కెనాల్స్, టన్నెల్స్, ఇతర అనేక అంశాలు పటిష్ఠంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రాజెక్టును నిలిపివేయబోతున్నారా? కూలగొడుతున్నారా? లక్ష కోట్లు పెట్టిన కట్టిన ప్రాజ్టెక్టుకు మరమ్మతు చేయాలి కదా? అని అసెంబ్లీ వేదికగా నిలదీశారు.
మంత్రుల తలోమాట
అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు తొలుత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పందించి ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చాక మరమ్మతులు చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, ప్రాజెక్టు నుంచి ఒక ఎకరానికి కూడా నీళ్లు రావు అని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి లాభం లేదని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం పడావు పెట్టనుందని రూఢీ అవుతున్నది.
మొత్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకూ ప్రాజెక్టుకు మరమ్మతులు జరగబోవని స్పష్టమైంది. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు తెలివి లేకుండా మాట్లాడుతున్నారని, ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదని అక్బరుద్దీన్ తూర్పారబట్టారు. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుంటే మూసీ నదికి గోదావరి జలాలను ఎక్కడి నుంచి తెస్తారని, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, టీడీపీల పాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని, ఇప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ద్వారా 18 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని గతంలో వెల్లడించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదని అంటున్నారని, మాట్లాడేముందు ఆలోచించుకోవాలని చురకలంటించారు.