హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయమై పదో షె డ్యూల్లో నిర్ణీత గడువును పేర్కొనలేదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయవాదులు సమీక్షిస్తున్నారని, చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చిస్తున్నారని పేర్కొన్నారు. పదో షెడ్యూల్‌కు సంబంధించి న్యాయస్థానాలు శాసనవ్యవస్థలకు ఆదేశాలు ఇవ్వొచ్చా అన్న అంశంపై కూడా సమీక్షిస్తున్నట్టు తెలిపారు. సీఎల్పీలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇచ్చిన తీర్పులో హైకోర్టు నాలుగు వారాల్లో ప్రక్రియను మొదలుపెట్టాలని మాత్రమే చెప్పిందని, రేపే నిర్ణయం తీసుకోవాలని చెప్పలేదని అన్నారు. అదేవిధంగా పదో షెడ్యూల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు సంబంధించి చర్యలు తీసుకునేందుకు ఎక్కడా కూడా నిర్ణీత గడువును పేర్కొనలేదని చెప్పారు. రోజులా, నెలలా, సంవత్సరాలా అన్న విషయం చెప్పలేదని అన్నారు.
నిబంధనల ప్రకారమే పీఏసీ చైర్మన్ ఎన్నిక
శాసనసభ స్పీకర్ రాజ్యాంగ స్ఫూర్తితో, నిబంధనలకు అనుగుణంగా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్‌గా నియమించారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఒక ప్రక్రియ ప్రకారమే స్పీకర్ ఫైనాన్షియల్ కమిటీలను ఏర్పాటు చేశారని చెప్పారు. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా మాట్లాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుందని, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకెళ్తున్నదని అన్నారు. పీఏసీ చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి.. తాను స్వయం గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పారని అన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ సూచించిన మూడు పేర్లు కాకుండా మరో వ్యక్తిని నియమించారనే ఆరోపణలపై మంత్రి సమాధానాన్ని దాటవేశారు.
వస్తామంటే.. వద్దంటామా!
ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తామంటే రావొద్దని అంటామా అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామ ని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలంటూ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారని, మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్యేలకు కూడా అదే వర్తిస్తుందా అని ప్రశ్నించగా.. అభివృద్ది కోసం వస్తుంటే రాళ్లతో ఎందుకు కొట్టాలని ఎదురు ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయింపులను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా. దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన వినతిపత్రాన్ని కార్యదర్శికి పంపించా. దానిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాను. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఓ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ వ్యక్తి ఆ పార్టీకే అండగా ఉండాలని భావించే వ్యక్తిని నేను. స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటది.
-జూలై మొదటి వారంలో ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోరాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
‘రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం శాసనసభ స్పీకర్ వ్యవస్థ.. ఒక ట్రైబ్యునల్ (న్యాయ ప్రాధికార సంస్థ) వంటిది. అందువల్ల ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్ల మీద వారు నిర్ణీత సహేతుక కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి. కొన్ని అసాధారణ సందర్భాలను మినహాయిస్తే, నిర్ణీత సహేతుక కాల వ్యవధి అంటే, అనర్హత దరఖాస్తు ఇచ్చిన తర్వాత గరిష్ఠంగా మూడు నెలల లోపలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది! నిబంధనలను ఉల్లంఘించి పార్టీ ఫిరాయించిన వారిపై పదో షెడ్యూలు మేరకు అనర్హత వేటు వేసి, రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలంటే, స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి.’
మహారాష్ట్ర గవర్నర్, తదితరులపై కేసులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ షా, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ నర్సింహతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. మే 11, 2023న వెలువరించిన తీర్పు
‘రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం, ఒక సభ్యుడి అనర్హతపై స్పీకర్ సత్వర నిర్ణయం తీసుకోవడానికి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలనుకుంటే కచ్చితంగా చేసుకోవచ్చు. స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షను కిహోటో హోలోహాన్ కేసు తీర్పు (1992)లోని 110, 111 పేరాలు ఏవిధంగానూ అడ్డుకోవడం లేదు. అనర్హతపై స్పీకర్ తుది నిర్ణయం తర్వాత న్యాయ సమీక్షకు కచ్చితంగా అవకాశం ఉన్నది. ఒకవేళ స్పీకర్ తాత్కాలిక అనర్హత, లేదా సస్పెన్షన్ చర్యలు తీసుకుంటే, కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవచ్చు’
మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ తదితరులపై కైషమ్ మేఘచంద్ర సింగ్ వేసిన కేసులో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రామసుబ్రమణ్యంతో కూడిన ధర్మానసం 2020 జనవరి 21న వెలువరించిన తీర్పు