హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): శాసనమండలిలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర మంత్రి డీ శ్రీధర్‌బాబు ప్రవేశపెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేశారు. అన్నీ అబద్ధాలే వల్లెవేస్తున్నారని, బోగస్ మాటలు చెప్తున్నారని వ్యంగ్యధోరణలో ఛలోక్తులు విసురుతూ తమ నిరసనలు తెలిపారు. మంత్రి తన ప్రసంగంలో రైతు రుణమాఫీని అమలు చేశామని ప్ర స్తావించగా, అది ‘ఫాల్స్’ అంటూ ఒక్కుమ్మడిగా నినదించారు.
రైతు బోనస్ ఇచ్చామనగానే, అదంతా ‘బోగస్’ అంటూ అరిచారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును ప్రస్తావించనప్పుడు.. అది తెలంగాణ తల్లి కాదు, ‘కాంగ్రెస్ తల్లి’ అం టూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తంచేశారు. తెలంగాణ పాట అనగానే.. దానికి ‘ఆంధ్రా మ్యూజిక్ .. చాలా బాగుంది’ అని ఎమ్మెల్సీ కవిత వ్యంగ్య ధోరణితో వ్యాఖ్యానించారు. చేనేతల కోసం రూ.20 వేల కోట్లు ప్రతిపాదించాల్సి ఉండగా, కేవలం రూ.11,405 కోట్లనే కేటాయించడాన్ని బీఆర్ఎస్ సభ్యులు తప్పుబట్టే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో 64.7 లక్షల మంది మహిళా స్వయం సహాయక సభ్యులకు రెండు నాణ్యమైన చీరలు ఇస్తామని అన్నప్పుడు.. అదంతా ‘ఫాల్స్.. ఫాల్స్’ అంటూ బడ్జెట్ ప్రసంగం మధ్యలో అభ్యంతరం తెలిపా రు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఓ సమయంలో జోక్యం చేసుకొని, వారిని వారించే ప్రయత్నం చేసినా, బడ్జెట్ చివరివరకు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అలాగే 16 కంపెనీలతో పెట్టుబడులు కుదుర్చుకున్నామని చెప్పగానే ఇదంతా ఫాల్స్ అంటూ అభ్యంతరం లిపారు. అంతకు ముందు శాసనమండలి ప్రారంభ సమయంలో రాష్ట్రంలో ఏర్పడిన నీటి ఎద్దడికి నిరసనగా మెడలో ఆకుపచ్చ కండువాలు కప్పుకొని సమావేశాలకు హాజరయ్యారు.