నేడు షెడ్యూల్ ప్రకటించే చాన్స్, 29 నుంచి విచారణఫిరాయింపులపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ పది మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై న్యాయవాదులు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రితో అసెంబ్లీ స్పీకర్ శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఫిరాయింపులకు సంబంధించి సమగ్రమైన, స్పష్టమైన సాక్ష్యాలున్నందున ఎలా ముందుకు పోవాలి? తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయన్నదానిపై సుదీర్ఘంగా చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈనెల 29 నుంచి ప్రత్యక్ష విచారణ ప్రారంభించి అక్టోబర్ 5లోపు ముగించే యోచనలో స్పీకర్ ఉన్నట్టు సమాచారం.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే అంశంపై అసెంబ్లీ స్పీకర్ చర్చలు మొదలు పెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శుక్రవారం తన కార్యాలయంలో న్యాయవాదులు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిరాయింపులపై చర్చలు జరిపినట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభ కార్యదర్శి ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేల నుంచి వివరణలు అందాయి. ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ వివరణలను పంపించారు. ఈ వివరణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాక్ష్యాలతో సహా తిరిగి లీగల్ ఫార్మాట్లో సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి కూడా స్పీకర్ నోటీసులు అందాయని, వారు ఈనెల 30వ తేదీలోపు వివరణ ఇచ్చే అవకాశం ఉన్నదని సమాచారం.
విచారణ ఎలా చేద్దాం?
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సమగ్రమైన, స్పష్టమైన సాక్ష్యాలు ఉన్న నేపథ్యంలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? ఆ చర్యల పర్యవసానాలు ఎలా ఉంటాయన్నదానిపై స్పీకర్, మంత్రి, న్యాయవాదులు చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ మొదటి వారంలో స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండువారాలకుపైగా అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఈనెల 29వ తేదీ నుంచే ప్రత్యక్ష విచారణ చేపడితే ఎలా ఉంటుందన్నదానిపై చర్చించినట్టు తెలిసింది. ప్రత్యక్ష విచారణ ఎలా ఉండాలి? ఎలా ఉంటుంది? అన్న అంశాలపైనా స్పీకర్ న్యాయనిపుణులతో ఆరా తీసినట్టు సమాచారం. 29వ తేదీ నుంచి ప్రత్యక్ష విచారణ ప్రారంభించి అక్టోబర్ 5వ తేదీలోపు విచారణ ప్రక్రియను ముగించే యోచనలో స్పీకర్ ఉన్నట్టు శాసనసభ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ క్రమంలోనే 29 నుంచి విచారణ ప్రక్రియను మొదలుపెట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి న్యాయవాదుల బృందం వివరాలను పంపించాలని స్పీకర్ కార్యాలయం అడిగింది. ఈ మేరకు బీఆర్ఎస్ బృందం ఒక జాబితాను శుక్రవారం స్పీకర్ కార్యాలయానికి అందజేసింది. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరిస్తుండటం, పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఆధారాన్ని ఇప్పటికే అందించిన నేపథ్యంలో కఠిన చర్యలు తప్పవని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి రావొచ్చని అంటున్నారు. ఇదే జరిగితే తమకు ఇబ్బంది ఎదురవుతుందని అధికార పార్టీ భావిస్తున్నది. దీంతో వీలైనంత వరకు డ్యామెజీ కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
వేటు వేయకముందే రాజీనామా?
మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదని తేలిపోవడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ విచారణ చేపట్టడానికి ముందే రాజీనామా చేస్తారని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేల నుంచి వివరణలు స్పీకర్‌కు చేరగా, దానం, కడియం మాత్రం ఇవ్వలేదు. గతేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీ ఫారంపై పోటీచేయగా, కడియం శ్రీహరి తన సొంత కూతురుకు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించుకొన్న సంగతి తెలిసిందే. దీంతో తాము ఎలాగూ ప్రత్యక్షంగా దొరికిపోయామన్న భావనలో వారు ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ మరో ఒకట్రెండు రోజుల్లోనే రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్నది.