Ration Cards | కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ప్రజా పాలనలో స్వీకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు.
గతంలో రేషన్‌కార్డులను కొత్తవి చేర్చడం, పాతవి తీసేయడం జరుగలేదన్నారు. లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సి ఉందన్నారు. ఆశావహుల డేటా సేకరణ కోసమే దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, ఇప్పటికే పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇల్లు కావాలనుకునే సైతం దరఖాస్తు చేసుకోవచ్చని.. అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రజావాణిలో ఇప్పటి వరకు 25వేల దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.