Build Now Portal | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతో సాఫీగా సాగిపోతున్న భవనాలు, లేఅవుట్ల అనుమతి విధానానికి కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డు పెట్టింది. ‘బిల్డ్ నౌ’ పేరుతో ఏదో కొత్త విధానం తెరపైకి తెచ్చింది. రియల్ అనుమతుల విషయంలో కాంగ్రెస్ మార్కు కోసం ఆరాటపడుతోంది. అయితే ఈ కొత్త విధానం రియల్లర్లను ఆందోళనకు గురిచేస్తోంది.. ఇప్పటికే డౌన్‌ఫాల్‌లో ఉన్న రియల్ వ్యాపారం మరింత ఊబిలోకి పోయే ప్రమాదం కొత్త విధానం వల్ల పొంచి ఉంది. రియల్ అనుమతుల కోసం ప్ర స్తుతం అందుబాటులో ఉన్న టీజీఈపాస్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయనున్నది.. ఆ స్థానంలో కొత్తగా తీసుకువస్తున్న ‘బిల్డ్ నౌ’ ఏకీకృత ఆన్లైన్ పోర్టల్ విధానంలో అనేక లోపాలు తొంగి చూస్తున్నాయి. టీజీఈపాస్ విధానంలో 30 రోజుల్లో సాధ్యం కాని అనుమతులు.. ఏకీకృత విధానంలో కేవలం 5 నిమిషాల్లోనే సాధ్యమతాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.
కాని దీనిపైనా సంబంధిత శాఖకు చెందిన అధికారులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నూతన అనుమతులు వ్యవస్థలో 5 నిమిషాల్లో ఎలా సాధ్యమవుతాయి? అన్న అంశంపై మరికొంత మంది అధికారులు మా త్రం నోరు మెదపడం లేదు. ఈ విధానంపై కనీ సం పూర్తి స్పష్టత కూడా ఇవ్వలేక పోతున్నారు. కేవలం ఒక ప్రైవేటు సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను నమ్మి, రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఏఐ విధానం వల్ల ఇ ది సాధ్యమేనని, కాని దానిని సమర్థవంతంగా అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులు పొందే విషయంలో రి యల్ వ్యాపారులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఇప్పటికే హెచ్ఎండీఏ/ మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ, జీటీసీపీ అనుమతులు పొందడంలో అనేక సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ అనుమతుల కోసం సంబంధిత భూములకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఫోర్జరీ సర్టిఫికెట్లు క్రాస్ వెరిఫికేషన్ చేసే యంత్రాంగం లేకపోయింది. ఈ కొత్త విధానానికి ‘ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(టీజీరెరా)ని అనుసంధానం చేస్తామన్నారు. అయితే స్వతంత్రంగా వ్యవహరించే రెరాను ఈ పోర్టల్‌కు ఎలా అనుసంధానం చేస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. నాన్-హై-రైజ్ భవన అనుమతులకు కూడా 21 నుంచి 15 రోజుల సమయం మాత్రం పడుతుందని చెప్తున్నారు.
ప్రకటన కాదు.. అమలు ముఖ్యం: క్రెడాయ్ జాతీయ కార్యదర్శి రామిరెడ్డి
రాష్ట్రంలో రియల్ అనుమతుల కోసం ఎంతో ఆర్భాటంగా ఏకీకృత విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా స్పందిస్తున్నాయి. వీరిలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏఐ విధానంలో 5 నిమిషాల్లో రియల్ అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాని ఆచరణ విషయంలో ఎవరికీ నమ్మకం లేదని క్రెడాయ్ జాతీయ కార్యదర్శి రామిరెడ్డి అన్నారు. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కాకుండా ట్రయల్ రన్ నిర్వహించాలని ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తున్నారు. కాని తొందరపాటు నిర్ణయాల వల్ల రియల్ వ్యాపారులు అనుమతుల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని, దాని ప్రభావం రియల్ వ్యాపార రంగంపై పడే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.