మంత్రి శ్రీధర్బాబుకూ కరెంటు ఇక్కట్లు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా మల్లారంలో అధికారిక కార్యక్రమానికీ కరెంటు కోతలు తప్పలేదు. దీంతో సెల్ఫోన్ల వెలుగులోనే కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చింది.
Power Cuts | మల్హర్, మార్చి 13: కాంగ్రెస్ పాలనలో సాక్షాత్తూ రాష్ట్ర మంత్రికే కరెంటు కష్టాలు తప్పలేదు. ఓ అధికారిక కార్యక్రమంలో కరెంటు పోవడంతో సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులోనే నడిపించారు. ఈ ఘటన బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారంలో చోటుచేసుకుంది. మల్హర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు బుధవారం రాత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మల్లారం కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సి ఉంది. కానీ.. రాత్రి 8.30 గంటలకు కార్యక్రమం నిర్వహించారు. అప్పటిదాకా విద్యార్థులు, అధికారులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. మంత్రి సభా వేదిక దిగుతుండగానే కరెంటు పోయింది. కరెంటు వస్తుందేమోనని మంత్రి దాదాపు పావుగంట ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకుందామని విద్యార్థులు ప్రయత్నించగా.. మొత్తం చీకటిగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ సెల్‌ఫోన్ లైట్లను వెలిగించారు. సెల్ఫోన్ల లైట్ల వెలుతురులోనే విద్యార్థులు మంత్రికి వినతిపత్రం ఇచ్చి.. ఆయనతో ఫొటో దిగారు.
ఫర్టిలైజర్‌సిటీ : ప్రజాహితమైన కార్యక్రమాల దృష్ట్యా గత ప్రభుత్వాలు చేపట్టిన పథకాలను, నిర్మాణాలను తాము కొనసాగించి వాటిని మరింత నిర్మాణాత్మకంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేయనున్న 355 ఆదనపు పడకల దవాఖాన భవన నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిరుడు బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన దవాఖానలో మౌలిక వసతుల కల్పనతోపాటు వైద్య కళాశాలలో టీచింగ్ సిబ్బందికి ఎలాంటి లోటూ రానివ్వబోమని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగానే వర్షాలు పడలేదని, జిల్లాలో సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.