హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): పరిశ్రమలు సామాజిక కర్తవ్యాన్ని, బాధ్యతలను తప్పకుండా నిర్వర్తించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజాభవన్లో ఆదివారం కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కంపెనీలు తమవంతు చేయూ త అందించాలని విజ్ఞప్తి చేశారు. ఒకో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, సెర్ప్ సీఈవో దివ్య, ములుగు, ఆదిలాబాద్ కలెక్టర్లు దివాకర్, రాజర్షిషా పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని, ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. అనేక బోగస్ హామీలతో గద్దనెక్కి 10 నెలలు గడుస్తున్నా.. ఒక్కటి అమలుచేయకుండా ప్రజలను మోసగిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్యారెంటీలకు దిక్కులేకుండా పోయిందని, సమస్యలను గాలికి వదిలి రూ.1.5 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. జన్వాడ రేవ్ పార్టీ నిజమో? కాదో? దర్యాప్తు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.