వికారాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా తెలంగాణ-ఏపీ రాష్ర్టాల మధ్యన మోదీ ప్రభుత్వం పంచాయతీ పెడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం వికారాబాద్‌లోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో రూ.2.02 కోట్లతో నిర్మించిన దుకాణ సముదాయాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసమే కృష్ణా జలాల వాటా తేల్చకుండా పెండింగ్‌లో పెట్టిందన్నారు. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టిన సమయంలో.. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనడం లేదని విమర్శించారు. 60 ఏండ్లు నిండిన రైతులకు పింఛన్లు ఇస్తామన్న కేంద్రం నుంచి ఇప్పటివరకు ఆ ప్రస్తావనే లేదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ తదితర పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత 18 రాష్ర్టాల్లో ఎక్కడా లేవన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో వికారాబాద్ జిల్లాకు సాగు నీరు తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే, ప్రతిపక్షాలు కేసులు వేస్తున్నాయని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో రుణమాఫీ కూడా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.