హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : ‘ఇకపై చిరుద్యోగులకు నెలనెలా వేతనాలు ఇస్తాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ) పరిధిలో పనిచేసే సుమారు 92వేల మంది ఉద్యోగులకు గ్రీన్‌చానెల్ ద్వారా రూ.115 కోట్లు చెల్లిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వీరికి కూడా ఒకటో తేదీనే వారి అకౌంట్లలో వేతన మొత్తాన్ని జమచేస్తాం’ ఇది ఆ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఏప్రిల్‌లో చెప్పిన మాట. గతంలో కూడా ఒకసారి జనవరి నుంచి చిరుద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఇక తమకు మంచిరోజులు రాబోతున్నాయని ఆయా ఉద్యోగులు సంబురపడ్డారు. కానీ, 15వ తేదీ వచ్చినా ఏప్రిల్ నెల వేతనం అందలేదు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం.. 92 వేల మందికిపైగా పనిచేస్తున్నారు. వీరిలో మల్టీపర్పస్ వర్కర్లు 52,473 మంది, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ సిబ్బంది 12, 586 మంది, గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్ ఆపరేటర్లు 1,301 మంది, మండల కంప్యూటర్ ఆపరేటర్లు 278 మంది, మండల పరిషత్‌లో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ వర్కర్లు 1,349 మంది, జిల్లా పరిషత్‌లో పార్ట్ టైమ్, ఫుల్‌టైమ్ వర్కర్లు 171 మంది, కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శులు తొమ్మిది మంది, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు 792 మంది, డీపీఎంలు 31 మంది, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 817 మంది, పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఉద్యోగులు 22,011 మంది, పీడీయూ జీకేవై సిబ్బంది 107, ఎస్‌ఎస్‌బీఎం 70, ఎస్ఎస్ఏఏటీ 180 ఇలా మొత్తం 92,175 మంది చిరుద్యోగులకు సకాలంలో వేతనాలు రావడం లేదు. గతంలో ఒక్కోసారి ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు పెండింగ్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఉపాధిహామీ పథకంలో పనిచేసేవారితోపా టు మల్టీపర్పస్ ఉద్యోగులకు నాలుగు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉండగా, ప్రభుత్వం ఇటీవల మూడు నెలల వేతనాలు ఇచ్చింది. మరో నెల వేతనం పెండింగ్‌లో పెట్టింది. 15వ తేదీ వచ్చినా ఏప్రిల్ నెల వేతనం చేతికి అందలేదు. ఉద్యోగ సంఘాల నేతలు డీపీవోలను అడిగితే.. తమకు తెలియదని చెప్తున్నారు. వేతన సమస్యను ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇకపై ప్రతినెలా సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. ప్రతినెలా 25వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఉద్యోగుల హాజరు వివరాలు సేకరించి, 26వ తేదీనే బిల్లులు సిద్ధం చేయాలని, ఆ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్.. డైరెక్టర్ సృజనకు ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఉద్యోగులు సంబురపడ్డారు. కానీ, 15వ తేదీవరకు సిబ్బందిలో ఒక్కరికీ కూడా వేతనాలు పడలేదు. వేతనాలకు సంబంధించిన జీవో జారీ కాలేదు. గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు చెల్లించే విధానానికి సంబంధించి ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు నెలనెలా సకాలంలో వేతనాలు చెల్లించాలి. వేసవి ఎండల తీవ్రత తగ్గే వరకు ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు పనిచేసుకొనేలా అనుమతించాలి. పంచాయతీ కార్మికుల ప్రాణాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక్కపూట పనికి అనుమతి ఇవ్వాలి.
ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ల బాధలు వర్ణనాతీతం. నాలుగు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉండగా, ఇటీవల మూడు నెలల వేతనాలు ఇచ్చారు. ఇంకా ఒక నెల వేతనం ఇవ్వాల్సి ఉన్నది. నెలనెలా వేతనాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ, ఇస్తలేరు. అకౌంట్లలో డబ్బులు పడ్తలేవు. నెలనెలా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.