మేడారం: మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. జాతరకు అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటిరకు 17 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌తో బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మేడారం జాతర ఏర్పాట్లను సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కవ మంది పారిశుద్ధ్య కార్మికులను మేడారంలో ఉంచామన్నారు. జాతర పర్యవేక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించామని చెప్పారు.
ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర జరుగుతుందని, ఈ నాలుగు రోజుల్లో 2 కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటారని అంచనావేశారు. జాతరకు ఇంత పెద్దమొత్తంలో భక్తులు రావడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. జాతర వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పారు. రెండు నెలల నుంచి అధికారులు ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. వీఐపీలు తమ వాహనాలను ములుగులో ఉంచి బస్సుల్లో మేడారానికి రావాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది ఉంటే ఫిర్యాదు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జాతర విజయవంతానికి సహకరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు. జాతరకు ఖర్చుపెట్టిన ప్రతి పైసా ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. తల్లుల చరిత్రను శిలాశాసనం చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు.