ములుగు, జనవరి26(నమస్తే తెలంగాణ) : లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహా జాతరకు పలారం మాదిరిగా వీఐపీ, వీవీఐపీ పాసులను మంజూరు చేయలేమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. సోమవారం ములుగులో ఆమె మీడియాతో మాట్లాడారు. వీఐపీలు పబ్లిక్‌గా వస్తేనే గొప్పతనంగా ఉంటుందని చెప్పారు. మంగళవారం నుంచి గద్దెల మీదికి భక్తులను అనుమతించేది లేదని, క్యూ ద్వారా దర్శనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
జాతరలో పాసుల జారీని రద్దు చేసేందుకు ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ప్రతి భక్తుడు క్రమశిక్షణగా స్వీయ నియంత్రణ పాటించి క్యూ ద్వారా వస్తేనే బాగుంటుందని అన్నారు. మేడారంలో పరిస్థితులు గతంలో లాగాలేవని, ప్రస్తుతం రోడ్లు, క్యూలు వెడల్పు అయ్యాయని తెలిపారు. స్థానిక, స్థానికేతర ప్రజాప్రతినిధులను గౌరవించి ఇప్పటికే పాసులు జారీ చేశామన్నారు. పాసుల కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను ఒత్తిడి చేయవద్దని, వీఐపీలు క్రమ శిక్షణగా వ్యవహరించాలని సూచించారు. సాధారణ భక్తుల కోసం వీఐపీలు సైతం పునరాలోచన చేయాలని సూచించారు.